Pilot Rohith Reddy
-
వేటేస్తారా.. వేచి చూస్తారా?
వికారాబాద్: డ్రగ్స్ కేసులో పేరు రావడంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువు శుక్రవారంతో ముగిసింది. అతని నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో వేటు వేస్తారా..? వేచి చూస్తారా? అనే విషయంపై చర్చ మొదలైంది. ఇటీవల మొయినాబాద్ సమీపంలోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం సభ్యులు దాడి చేసి పైలెట్‌తో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టారం వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గడువు ముగిసిన నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ నాయకులల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సస్సెండ్ చేస్తే లాభమా.. నష్టామా..? ఒకవేళ పైలెట్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు.. పార్టీకి జరిగే లాభ నష్టాలపై బీఆర్ఎస్ అధిష్టానం బేరీజు వేసుకుంటున్నట్లు తెలిసింది. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రోహిత్‌రెడ్డిని మందలించి పార్టీలో కొనసాగిస్తే తర్వాత ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని అన్నది పెద్ద సమస్యగా మారనుంది. అవకాశం వచి్చన ప్రతిసారీ డ్రగ్స్ కేసు ఉదంతాన్ని తెరమీదకు తెచ్చి ప్రతిపక్షాలు లాభం పొందుతాయనే భయం కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని అడ్డం పెట్టకుని కేటీఆర్‌తో పాటు మొత్తం పార్టీని టార్గెట్ చేసే అవకాశం ఉందనే వాదన పార్టీ సీనియర్లు తెరమీదకు తెస్తున్నట్టు సమాచారం.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న పైలెట్‌ను పార్టీ దూరం చేసుకుంటే అతను ఏమైనా లొసుగులు బయటపెట్టి పారీ్టని, పార్టీ పెద్దలను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేస్తాడా..? అనేది కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పారీ్టలో ఉంచాలా తొలగించాలా అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. గతంలోనూ పలు సందర్భాల్లో రోహిత్‌రెడ్డి అతని సోదరుడిపై డ్రగ్స్ ఆరోపణలు రాగా ప్రత్యర్థులు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారనే అభియోగాల నేపథ్యంలో అధిష్టానం అతనిపై వేటు వేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. రేసులో ముగ్గురి పేర్లు పైలెట్‌ను తప్పిస్తే తాండూరు బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో రోహిత్‌రెడ్డి తర్వాత అంత స్థాయి ఉన్న నాయకులు లేకపోవడం పారీ్టకి లోటుగా కనిపిస్తోంది. మరో నేత శ్రీశైల్‌రెడ్డి ఉన్నా రోహిత్‌రెడ్డికి చిన్నాన్నే కావడంతో ఆయనకు పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. ఇన్నాళ్లు పార్టీలో ఉంటూ వచ్చిన పట్నం కుటుంబం ఎన్నికలయ్యాక అధికార పార్టీ గూటికి చేరడం, మరో నాయకుడు మురళీకృష్ణ కూడా పార్టీని వీడటంతో నియోకవర్గ బాధ్యతలు మోసేంత సమర్థులు కనిపించడంలేదు. ఇప్పటికే దిగుమతి నేతలతో నిండిన తాండూరుకు మరో నేతను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకునే పరిస్థితి వద్దనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా తాండూరు టికెట్ ఆశిస్తూ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్న ఉద్యమ నాయకుడు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. షాబాద్ తాజా మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డికి అక్కడ పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయనకు బాధ్యతలు ఇస్తే మహేందర్‌రెడ్డి వర్గాన్ని అక్కున చేర్చుకొని బీఆర్ఎస్కు లాభం జరగే అవకాశాలున్నాయి. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తనయుడు కొప్పుల అనీల్రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిని అన్ని విధాలుగా ఎదుర్కోగలిగిన నేత కోసం బీఆర్ఎస్ అధిష్టానం గాలిస్తున్నట్లు సమాచారం. -
కాల్పులు జరిపి తప్పించుకోవాలని..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిప్రకారం ఫాంహౌస్‌ను ‘ఈగల్’ బృందం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అవాక్కైన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ , పైలట్ రోహిత్‌ల బృందం వారిపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ 0.32 జర్మనీ తయారీ రివాల్వర్‌తో తొలుత మూడు రౌండ్లపాటు కాల్పులకు దిగాడు. తాము పోలీసులమని, సోదాలకు వచ్చామని చెబుతున్నా నమిత్ శర్మ మాత్రం తమను లక్ష్యంగా చేసుకొని కూడా ఒక రౌండ్ కాల్పులు జరిపాడని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ బుల్లెట్ ఎవరికీ తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే తాము అప్రమత్తం అయ్యామని.. అదే సమయంలో ‘కాల్చి పారేయండి.. మొత్తం నేను చూసుకుంటాను. ఏం జరిగినా నాదే బాధ్యత’ అంటూ ఒకరు గట్టిగా అరిచినట్లు వినిపడిందని వివరించారు. తమను భయభ్రాంతులకు గురిచేసి కాల్పులు జరిపి ఫాంహౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని అక్కడున్న వారు ప్లాన్ వేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం, ఎక్సైజ్ చట్టాలతోపాటు ఆయుధాల చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కాల్పులతో సంబంధం ఉన్న పైలట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మలను అరెస్ట్ చేశారు. కాల్పులుకు తెగబడ్డ నమిత్ శర్మను ఏ–1గా, ఫాంహౌస్ యజమాని, పార్టీ ఏర్పాటు చేసిన పైలట్ రోహిత్‌రెడ్డిని ఏ–2గా, అతడి సోదరుడు, కాల్పుల జరిగిన తుపాకీ లైసెన్స్ కలిగిన రితేశ్‌రెడ్డిని ఏ–3గా పేర్కొన్నారు. పోలీసులపై హత్యాయత్నం, వారి విధులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం నిందితులకు జ్యుడీíÙయల్ కస్టడీ విధించింది. మరింత కిక్కు కోసమే మద్యంలో కొకైన్.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. మత్తు కిక్కు కోసమే టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వారి మిత్రులు మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారు. పార్టీని రంజుగా ఎంజాయ్ చేసేందుకే ఖరీదైన పలు బ్రాండ్ల మద్యంతోపాటు కొకైన్ తెప్పించుకున్నారు. పోలీసుల సోదాల అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ టెస్ట్‌లు, అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, నమిత్ శర్మలకు పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయింది. పార్టీలో వాడిన కొకైన్‌ను తానే తెచ్చానని కౌశిక్ రవి పోలీసుల ఎదుట అంగీకరించాడు. సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్‌ను ఒక్కో గ్రాము రూ. 15,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ అంగీకరించాడు. -
టీడీపీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ వద్ద ఫాంహౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి జరిపిన పరీక్షల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఈగల్ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకోలేదని బుకాయిస్తూ టీడీపీ ఎంపీ పుట్టా యూరిన్‌లో నీళ్లు కలిపి తొలుత ఎత్తులు వేసినా తుదకు అవి పారలేదు. ఈగల్ అధికారులు రక్త నమూనా పరీక్షలు చేయించడంతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. అజీజ్‌నగర్ సమీపంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో ఈగల్ టీం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించి ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) డైరెక్టర్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నిబంధనల ప్రకారం డ్రగ్ పాజిటివ్ వచ్చినా, గన్ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను మాత్రమే పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్ కోర్టు జడ్జి నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు ప్రవేశపెట్టగా, ఆయన వారికి రిమాండ్ విధించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను తప్పించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అందుకే డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్‌లో శనివారం కొందరు పార్టీ చేసుకుంటున్నారని, అందులో డ్రగ్స్ కూడా వాడుతున్నట్టు ఈగల్ టీం అధికారులకు సమాచారం అందింది. వారు ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి శనివారం రాత్రి 10 గంటకు ఆ ఫాం హౌస్ వద్దకు సోదాల కోసం వెళ్లారు. అదే సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో పోలీసులు హుటాహుటిన లోపలికి వెళ్లి చూశారు. ఫాం హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో సోఫాల్లో కొంత మంది కూర్చుని మద్యం సేవిస్తుండగా, వాష్‌రూం దగ్గర ఉన్న వ్యక్తి నమిత్ శర్మ చేతిలో 0.32 జర్మన్ డ్ రివాల్వర్, అతడి పక్కన ఉన్న సిల్వరి శరత్‌కుమార్ చేతుల్లో ఖాళీ బుల్లెట్ కేస్లు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫాంహౌస్‌లో సోదాలు జరపగా మరో తొమ్మిది మంది మద్యం, ఇతర మత్తు పదార్థాలు తీసుకుటున్నట్టు గుర్తించారు. 0.26 గ్రాముల కొకైన్ పట్టుబడింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పీఏ/డ్రైవర్ సిల్వరి శరత్ కుమార్ కొకైన్‌ను అందరికీ పంచి, మిగిలిన రెండు ప్యాకెట్లు తన జేబులో పెట్టుకోవడంతో అది పోలీసులకు దొరికింది. దీన్ని తన యజమాని రోహిత్‌రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి తెచ్చాడని తెలిపాడు. తాను వ్యాపార పర్యటనలో సిమ్లాకు వెళ్లినప్పుడు తెలియని వ్యక్తి నుంచి కొకైన్‌ను కొన్నానని, దానిని ఈ పార్టీకి తీసుకువచ్చినట్టు కౌశిక్ రవి కూడా అంగీకరించాడు. రాత్రి నెగెటివ్.. ఉదయానికి పాజిటివ్ సోదాల అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న 11 మందికీ డ్రగ్ టెస్ట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తొలుత టెస్ట్‌కు శాంపిల్ ఇచ్చేందుకు ఎంపీ మహేశ్‌కుమార్ అంగీకరించలేదని, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. పోలీసులు, ఈగల్ అధికారులు టెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గిన ఆయన కొత్త ఎత్తులు వేసినట్టు సమాచారం. టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని కోరగా, పుట్టా మహేష్ యూరిన్‌కు బదులు వాటర్ ఇవ్వడంతో తాత్కాలికంగా శనివారం రాత్రి చేసిన టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. దీన్ని అదనుగా చూపుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే, నిబంధనల మేరకు డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారందరికీ రక్త పరీక్షలు తప్పనిసరి అని చెప్పడంతో ఎర్రగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి 11 మంది రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించారు. దీంతో ఎంపీ మహేశ్ కుమార్ రక్త నమూనా పరీక్షలో డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. పెద్ద ఎత్తున మద్యం సీసాలూ లభ్యం కింగ్ ఫినిష్డ్ ఆల్ట్రా 330 ఎంఎల్ 48 సీసాలు, రెండు డాన్జులియో 700 ఎంఎల్ సీసాలు, రాయల్ సెల్యూట్ 21 ఏళ్ల మద్యం లీటర్ సీసా ఒకటి, చివాస్ 18 ఏళ్ల మద్యం సీసాలు 2, బెలివడెరీ వోడ్కా 700 ఎంఎల్ రెండు సీసాలు పట్టుబడ్డాయి. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు ఫాంహౌస్ డ్రగ్ పార్టీకి సంబంధించి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్సై నయాముద్దీన్ ఫిర్యాదు మేరకు నిందితులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆదివారం క్రైం నంబర్ 150/2026 కింద కేసు నమోదైంది. డ్రగ్స్ వినియోగం, మారణాయుధాల వాడకం, నేరానికి ప్రేరేపించారనే కారణంతో ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 8 (సీ), 22(ఏ), 27, 29 ఆరŠమ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25(1–బి)(ఏ), సెక్షన్ 30, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్‌లోని సెక్షన్ 34 (ఏ), బీఎన్ఎస్ సెక్షన్ 109,131 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీళ్లంతా ఎందుకు కలిశారు? మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్ పార్టీలో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఒకచోట చేరడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యాపార లావాదేవీలతోపాటు వీరి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమైన డీల్ విషయమై చర్చించేందుకే వీరంతా స్నేహ పూర్వకంగా శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పట్టుబడిన వారిలో స్థానిక రాజకీయ నాయకుడు రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌లు ఉండడం, వీరితోపాటు బిజినెస్‌లో ఉన్న మోరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, అర్జున్‌రెడ్డి, అడ్వొకేట్ రవి ఉన్నారు. ఏ డీల్ కోసం భేటీ అయ్యారన్నది దర్యాప్తులో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. టీడీపీ ఎంపీ సహా ఆరుగురికి పాజిటివ్ : ఈగల్ ఎస్పీ గిరిధర్ ‘మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు శనివారం మాకు పక్కా సమాచారం అందింది. మా ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులతో కలిసి ఫామ్‌హౌజ్‌పై రైడ్ చేసేందుకు వెళ్లాం. అక్కడికి వెళ్లిన సమయంలో మాకు అక్కడ గన్ కాల్చినట్టు శబ్దం వినిపించింది. వెంటనే మా అధికారులు, సిబ్బంది పరుగెత్తుకుని ఫాం హౌస్‌లోకి వెళ్లి గన్ పట్టుకున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. అతడు ఆకాశం వైపు గన్ ఎక్కుపెట్టి కాల్చినట్టు నిర్ధారణ అయ్యింది. అతడి పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఉపయోగించిన నాలుగు క్యాట్రిజెస్ స్వాదీనం చేసుకున్నాం. ముందుగా కస్టడీలోకి తీసుకున్న ఇద్దరితోపాటు ఆ ఫాంహౌస్ పార్టీలో పాల్గొన్న ఒక మహిళ సహా తొమ్మిది మందికి వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేశాం. అందులో తొలుత ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 4 ప్రకారం.. పట్టుబడిన వారందరికీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎంపీ పట్టా మహేశ్ కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ, తిరువీధుల అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి ఉన్నారు. నెగిటివ్ వచ్చిన వారిలో మొరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయకృష్ణ, సిలివేరి శరత్‌కుమార్, ఆర్.ప్రియాంకరెడ్డి ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం పార్టీ మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. కొందరు కొందరుగా యాడ్ అవుతూ వచ్చారు. ఇలా మొత్తం 11 మంది వచ్చిన సమయంలో మేం అదుపులోకి తీసుకున్నాం. వెపన్ కాల్చిన వ్యక్తిని జైపూర్‌కు చెందిన నమిత్ శర్మగా గుర్తించాం. రితేశ్‌రెడ్డి పేరిట ఆ తుపాకీ లైసెన్స్ ఉన్నట్టు అతను తెలిపాడు. అతడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. అతడు ఎందుకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో ఏర్పాటు చేశారు’అని ఆదివారం ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాకు తెలిపారు. రెండు గ్రాముల కొకైన్‌ను పార్టీ కోసం తీసుకురాగా.. ఒక గ్రామ్ వరకు కొకైన్‌ను ఫాం హౌస్‌లో గుర్తించామని, పట్టుబడిన డ్రగ్ కచ్చితంగా ఏంటనేది ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని చెప్పారు. ముగ్గురికి రిమాండ్.. మిగతా వారికి స్టేషన్ బెయిల్ ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని పక్కన పెట్టి.. కేవలం గన్ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను మాత్రమే పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కాగా, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ చేయడంలో పోలీసులు తాత్సారం చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఘటన జరిగితే ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. శనివారం రాత్రి పట్టుబడిన 11 మందిని తొలుత శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొయినాబాద్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేసి దాన్ని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ముగ్గురిని రిమాండ్‌కు తరలించి, మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. నిందితులు మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
ఆ రెండు ఐఫోన్లను ఎందుకు ధ్వంసం చేసినట్లు..?
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం పోలీసులు దాడులు జరిపే సమయంలో ఫాంహౌస్‌లో ధ్వంసమైన రెండు ఐఫోన్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ రెండు ఫోన్లు పైలెట్ రోహిత్‌రెడ్డి అతని పీఏ శ్రవణ్దేనని తెలుస్తోంది.అయితే, ఆ ఫోన్లను ధ్వంసం చేసింది పైలెట్ రోహిత్‌రెడ్డేనని పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశంపై పైలెట్ పీఏ శ్రవణ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణతో డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన ఫాంహౌస్ జరిగిన వీకెండ్ పార్టీలో పైలెట్ రోహిత్‌రెడ్డి,అతడి సోదరుడు రితేష్ రెడ్డి ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు దొరికాడు. వీరితో పాటు పలువురు సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీం పోలీసులు ఫాం హౌస్‌పై దాడులు జరిపి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్
సాక్షి,హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ వీకెండ్ పార్టీలో ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్ల నిర్ధారించారు. వారందరికి ప్రస్తుతం డ్రగ్స్ టెస్టులు జరుగుతున్నాయన్న పోలీసులు.. వాళ్లు తీసుకున్నది ఎలాంటి డ్రగ్స్ అనేది పూర్తిస్థాయిలో టెస్టులు ఫలితాల తరువాతే తెలుస్తాయని చెప్పారు. డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలుఅయితే మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్ టెస్ట్ విషయంలో ఎంపీ పుట్టా మహేష్ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్ శాంపిల్ బదులు వాటర్ ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్ బాటిల్లో ఉంది యూరిన్ కాదని నీళ్లని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని.. నీళ్లు కాదని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌పై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం పుట్టా మహేష్ నుంచి యూరిన్ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్ బ్లడ్ టెస్టులో పాజిటీవ్‌గా నిర్ధారణైంది.డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్..డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి 3గంటల నుంచి ఫాం హౌస్‌లో పార్టీ జరుగుతోంది. రాత్రి 7.30 సమయంలో ఎంపీ పుట్టా మహేష్ ఫాం హౌస్‌కు వచ్చారు. సోదాల సమయంలో కాల్పులు జరిపారు. గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించాం’అని పేర్కొన్నారు.


