డ్రగ్స్ కేసులో పైలెట్‌కు ఇచ్చిన గడువు పూర్తి
వివరణ ఇవ్వని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
చర్యలు ఉంటాయా లేదా అన్నదానిపై చర్చ
కొనసాగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందనే వాదన
వేటు వేస్తే తాండూరు బాధ్యతలు ఎవరికో?
వినిపిస్తున్న ముగ్గురు నాయకుల పేర్లు
వికారాబాద్: డ్రగ్స్ కేసులో పేరు రావడంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ అధిష్టానం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువు శుక్రవారంతో ముగిసింది. అతని నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో వేటు వేస్తారా..? వేచి చూస్తారా? అనే విషయంపై చర్చ మొదలైంది. ఇటీవల మొయినాబాద్ సమీపంలోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం సభ్యులు దాడి చేసి పైలెట్‌తో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అధిష్టారం వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గడువు ముగిసిన నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ నాయకులల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
సస్సెండ్ చేస్తే లాభమా.. నష్టామా..?
ఒకవేళ పైలెట్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు.. పార్టీకి జరిగే లాభ నష్టాలపై బీఆర్‌ఎస్ అధిష్టానం బేరీజు వేసుకుంటున్నట్లు తెలిసింది. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రోహిత్‌రెడ్డిని మందలించి పార్టీలో కొనసాగిస్తే తర్వాత ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని అన్నది పెద్ద సమస్యగా మారనుంది. అవకాశం వచి్చన ప్రతిసారీ డ్రగ్స్ కేసు ఉదంతాన్ని తెరమీదకు తెచ్చి ప్రతిపక్షాలు లాభం పొందుతాయనే భయం కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని అడ్డం పెట్టకుని కేటీఆర్‌తో పాటు మొత్తం పార్టీని టార్గెట్ చేసే అవకాశం ఉందనే వాదన పార్టీ సీనియర్లు తెరమీదకు తెస్తున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న పైలెట్‌ను పార్టీ దూరం చేసుకుంటే అతను ఏమైనా లొసుగులు బయటపెట్టి పారీ్టని, పార్టీ పెద్దలను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేస్తాడా..? అనేది కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పారీ్టలో ఉంచాలా తొలగించాలా అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. గతంలోనూ పలు సందర్భాల్లో రోహిత్‌రెడ్డి అతని సోదరుడిపై డ్రగ్స్ ఆరోపణలు రాగా ప్రత్యర్థులు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారనే అభియోగాల నేపథ్యంలో అధిష్టానం అతనిపై వేటు వేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు.
రేసులో ముగ్గురి పేర్లు
పైలెట్‌ను తప్పిస్తే తాండూరు బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో రోహిత్‌రెడ్డి తర్వాత అంత స్థాయి ఉన్న నాయకులు లేకపోవడం పారీ్టకి లోటుగా కనిపిస్తోంది. మరో నేత శ్రీశైల్‌రెడ్డి ఉన్నా రోహిత్‌రెడ్డికి చిన్నాన్నే కావడంతో ఆయనకు పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. ఇన్నాళ్లు పార్టీలో ఉంటూ వచ్చిన పట్నం కుటుంబం ఎన్నికలయ్యాక అధికార పార్టీ గూటికి చేరడం, మరో నాయకుడు మురళీకృష్ణ కూడా పార్టీని వీడటంతో నియోకవర్గ బాధ్యతలు మోసేంత సమర్థులు కనిపించడంలేదు. ఇప్పటికే దిగుమతి నేతలతో నిండిన తాండూరుకు మరో నేతను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకునే పరిస్థితి వద్దనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి.
కొంత కాలంగా తాండూరు టికెట్ ఆశిస్తూ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్న ఉద్యమ నాయకుడు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. షాబాద్ తాజా మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డికి అక్కడ పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయనకు బాధ్యతలు ఇస్తే మహేందర్‌రెడ్డి వర్గాన్ని అక్కున చేర్చుకొని బీఆర్‌ఎస్‌కు లాభం జరగే అవకాశాలున్నాయి. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తనయుడు కొప్పుల అనీల్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిని అన్ని విధాలుగా ఎదుర్కోగలిగిన నేత కోసం బీఆర్‌ఎస్ అధిష్టానం గాలిస్తున్నట్లు సమాచారం.


