టీడీపీ గుట్టురట్టు | Pilot Rohit Reddy, his brother Ritesh Reddy, Namit Sharma remanded | Sakshi
Sakshi News home page

టీడీపీ గుట్టురట్టు

Mar 16 2026 4:03 AM | Updated on Mar 16 2026 4:03 AM

Pilot Rohit Reddy, his brother Ritesh Reddy, Namit Sharma remanded

ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్, తదితరులు

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ 

రాత్రి యూరిన్‌లో నీళ్లు కలిపి టెస్ట్‌లో పాజిటివ్‌ రాకుండా తంటాలు

రక్త నమూనా పరీక్షలో బండారం బట్టబయలు  

పట్టుబడిన 11 మందిలో ఆరుగురు డ్రగ్స్‌ వాడినట్టు పోలీసుల నిర్ధారణ 

బీఎన్‌ఎస్, ఎన్‌డీపీఎస్‌ యాక్ట్, ఆర్మ్స్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు 

పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌ శర్మకు రిమాండ్‌  

పుట్టా మహేశ్, మరో ఏడుగురికి స్టేషన్‌ బెయిల్‌ 

బిజినెస్‌ డీల్‌ కోసమే వీరంతా డ్రగ్స్‌ పార్టీలో భేటీ 

సోదాల్లో కొకైన్, వివిధ రకాల ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాదీనం

సాక్షి, హైదరాబాద్‌/మొయినాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ వద్ద ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడిన వారికి జరిపిన పరీక్షల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ సహా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు ఈగల్‌ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్‌ తీసుకోలేదని బుకాయిస్తూ టీడీపీ ఎంపీ పుట్టా యూరిన్‌లో నీళ్లు కలిపి తొలుత ఎత్తులు వేసినా తుదకు అవి పారలేదు. ఈగల్‌ అధికారులు రక్త నమూనా పరీక్షలు చేయించడంతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. 

అజీజ్‌నగర్‌ సమీపంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో ఈగల్‌ టీం, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించి ఈగల్‌ (ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) డైరెక్టర్‌ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ నిబంధనల ప్రకారం డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చినా, గన్‌ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్‌ వ్యాపారి నమిత్‌ శర్మలను మాత్రమే పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్‌ కోర్టు జడ్జి నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు ప్రవేశపెట్టగా, ఆయన వారికి రిమాండ్‌ విధించారు. 

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి పోలీసులే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ను తప్పించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అందుకే డ్రగ్స్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినా, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

అసలేం జరిగిందంటే..  
మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్‌లో శనివారం కొందరు పార్టీ చేసుకుంటున్నారని, అందులో డ్రగ్స్‌ కూడా వాడుతున్నట్టు ఈగల్‌ టీం అధికారులకు సమాచారం అందింది. వారు ఫ్యూచర్‌ సిటీ ఎస్‌ఓటీ, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి శనివారం రాత్రి 10 గంటకు ఆ ఫాం హౌస్‌ వద్దకు సోదాల కోసం వెళ్లారు. అదే సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో పోలీసులు హుటాహుటిన లోపలికి వెళ్లి చూశారు. ఫాం హౌస్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌ సమీపంలో సోఫాల్లో కొంత మంది కూర్చుని మద్యం సేవిస్తుండగా, వాష్‌రూం దగ్గర ఉన్న వ్యక్తి నమిత్‌ శర్మ చేతిలో 0.32 జర్మన్‌ డ్‌ రివాల్వర్, అతడి పక్కన ఉన్న సిల్వరి శరత్‌కుమార్‌ చేతుల్లో ఖాళీ బుల్లెట్‌ కేస్‌లు గుర్తించారు. 

వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫాంహౌస్‌లో సోదాలు జరపగా మరో తొమ్మిది మంది మద్యం, ఇతర మత్తు పదార్థాలు తీసుకుటున్నట్టు గుర్తించారు. 0.26 గ్రాముల కొకైన్‌ పట్టుబడింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పీఏ/డ్రైవర్‌ సిల్వరి శరత్‌ కుమార్‌ కొకైన్‌ను అందరికీ పంచి, మిగిలిన రెండు ప్యాకెట్లు తన జేబులో పెట్టుకోవడంతో అది పోలీసులకు దొరికింది. దీన్ని తన యజమాని రోహిత్‌రెడ్డి స్నేహితుడు కౌశిక్‌ రవి తెచ్చాడని తెలిపాడు. తాను వ్యాపార పర్యటనలో సిమ్లాకు వెళ్లినప్పుడు తెలియని వ్యక్తి నుంచి కొకైన్‌ను కొన్నానని, దానిని ఈ పార్టీకి తీసుకువచ్చినట్టు కౌశిక్‌ రవి కూడా అంగీకరించాడు.  

రాత్రి నెగెటివ్‌.. ఉదయానికి పాజిటివ్‌ 
సోదాల అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న 11 మందికీ డ్రగ్‌ టెస్ట్‌ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తొలుత టెస్ట్‌కు శాంపిల్‌ ఇచ్చేందుకు ఎంపీ మహేశ్‌కుమార్‌ అంగీకరించలేదని, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. పోలీసులు, ఈగల్‌ అధికారులు టెస్ట్‌ చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గిన ఆయన కొత్త ఎత్తులు వేసినట్టు సమాచారం. టెస్ట్‌ కోసం యూరిన్‌ శాంపిల్‌ ఇవ్వాలని కోరగా, పుట్టా మహేష్‌ యూరిన్‌కు బదులు వాటర్‌ ఇవ్వడంతో తాత్కాలికంగా శనివారం రాత్రి చేసిన టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చింది. 

దీన్ని అదనుగా చూపుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే, నిబంధనల మేరకు డ్రగ్స్‌ పార్టీలో పట్టుబడిన వారందరికీ రక్త పరీక్షలు తప్పనిసరి అని చెప్పడంతో ఎర్రగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి 11 మంది రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించారు. దీంతో ఎంపీ మహేశ్‌ కుమార్‌ రక్త నమూనా పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌గా తేలింది.  

పెద్ద ఎత్తున మద్యం సీసాలూ లభ్యం 
కింగ్‌ ఫినిష్డ్‌ ఆల్ట్రా 330 ఎంఎల్‌ 48 సీసాలు, రెండు డాన్‌జులియో 700 ఎంఎల్‌ సీసాలు, రాయల్‌ సెల్యూట్‌ 21 ఏళ్ల మద్యం లీటర్‌ సీసా ఒకటి, చివాస్‌ 18 ఏళ్ల మద్యం సీసాలు 2, బెలివడెరీ వోడ్కా 700 ఎంఎల్‌ రెండు సీసాలు పట్టుబడ్డాయి.  

ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు  
ఫాంహౌస్‌ డ్రగ్‌ పార్టీకి సంబంధించి మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై నయాముద్దీన్‌ ఫిర్యాదు మేరకు నిందితులపై మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం క్రైం నంబర్‌ 150/2026 కింద కేసు నమోదైంది. డ్రగ్స్‌ వినియోగం, మారణాయుధాల వాడకం, నేరానికి ప్రేరేపించారనే కారణంతో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 8 (సీ), 22(ఏ), 27, 29 ఆరŠమ్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 25(1–బి)(ఏ), సెక్షన్‌ 30, తెలంగాణ ఎక్సైజ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 34 (ఏ), బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 109,131 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

వీళ్లంతా ఎందుకు కలిశారు?  
మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్‌ పార్టీలో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులంతా ఒకచోట చేరడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యాపార లావాదేవీలతోపాటు వీరి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమైన డీల్‌ విషయమై చర్చించేందుకే వీరంతా స్నేహ పూర్వకంగా శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 

పట్టుబడిన వారిలో స్థానిక రాజకీయ నాయకుడు రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌లు ఉండడం, వీరితోపాటు బిజినెస్‌లో ఉన్న మోరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయ్‌ కృష్ణ, అర్జున్‌రెడ్డి, అడ్వొకేట్‌ రవి ఉన్నారు. ఏ డీల్‌ కోసం భేటీ అయ్యారన్నది దర్యాప్తులో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.  

టీడీపీ ఎంపీ సహా ఆరుగురికి పాజిటివ్‌ : ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌  
‘మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌ హౌజ్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతున్నట్టు శనివారం మాకు పక్కా సమాచారం అందింది. మా ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి ఫామ్‌హౌజ్‌పై రైడ్‌ చేసేందుకు వెళ్లాం. అక్కడికి వెళ్లిన సమయంలో మాకు అక్కడ గన్‌ కాల్చినట్టు శబ్దం వినిపించింది. వెంటనే మా అధికారులు, సిబ్బంది పరుగెత్తుకుని ఫాం హౌస్‌లోకి వెళ్లి గన్‌ పట్టుకున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. అతడు ఆకాశం వైపు గన్‌ ఎక్కుపెట్టి కాల్చినట్టు నిర్ధారణ అయ్యింది. 

అతడి పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఉపయోగించిన నాలుగు క్యాట్రిజెస్‌ స్వాదీనం చేసుకున్నాం. ముందుగా కస్టడీలోకి తీసుకున్న ఇద్దరితోపాటు ఆ ఫాంహౌస్‌ పార్టీలో పాల్గొన్న ఒక మహిళ సహా తొమ్మిది మందికి వెంటనే డ్రగ్స్‌ టెస్ట్‌ చేశాం. అందులో తొలుత ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 4 ప్రకారం.. పట్టుబడిన వారందరికీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించగా.. ఆరుగురికి డ్రగ్‌ పాజిటివ్‌గా తేలింది. 

పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎంపీ పట్టా మహేశ్‌ కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ, తిరువీధుల అర్జున్‌రెడ్డి, కౌశిక్‌ రవి ఉన్నారు. నెగిటివ్‌ వచ్చిన వారిలో మొరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయకృష్ణ, సిలివేరి శరత్‌కుమార్, ఆర్‌.ప్రియాంకరెడ్డి ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం పార్టీ మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. కొందరు కొందరుగా యాడ్‌ అవుతూ వచ్చారు. ఇలా మొత్తం 11 మంది వచ్చిన సమయంలో మేం అదుపులోకి తీసుకున్నాం. 

వెపన్‌ కాల్చిన వ్యక్తిని జైపూర్‌కు చెందిన నమిత్‌ శర్మగా గుర్తించాం. రితేశ్‌రెడ్డి పేరిట ఆ తుపాకీ లైసెన్స్‌ ఉన్నట్టు అతను తెలిపాడు. అతడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. అతడు ఎందుకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో ఏర్పాటు చేశారు’అని ఆదివారం ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌ మీడియాకు తెలిపారు. రెండు గ్రాముల కొకైన్‌ను పార్టీ కోసం తీసుకురాగా.. ఒక గ్రామ్‌ వరకు కొకైన్‌ను ఫాం హౌస్‌లో గుర్తించామని, పట్టుబడిన డ్రగ్‌ కచ్చితంగా ఏంటనేది ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని చెప్పారు.  

ముగ్గురికి రిమాండ్‌.. మిగతా వారికి స్టేషన్‌ బెయిల్‌  
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చిన వారిని పక్కన పెట్టి.. కేవలం గన్‌ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్‌ వ్యాపారి నమిత్‌ శర్మను మాత్రమే పోలీసులు రిమాండ్‌ చేశారు. నిందితుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. కాగా, ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ చేయడంలో పోలీసులు తాత్సారం చేసినట్లు తెలుస్తోంది. 

శనివారం రాత్రి ఘటన జరిగితే ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. శనివారం రాత్రి పట్టుబడిన 11 మందిని తొలుత శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొయినాబాద్‌ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత రిమాండ్‌ రిపోర్టు తయారు చేసి దాన్ని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ముగ్గురిని రిమాండ్‌కు తరలించి, మిగిలిన వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. నిందితులు మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement