సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నిక పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.
52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు.
ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. 50 వేల వరకు మాత్రమే నగదు అనుమతి... 50 వేల కంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలి. వెబ్ కాస్టింగ్ ఉంటుంది.. పటిష్టమైన బందొబస్తు ఉంటుంది. 22వేల మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. 1926 సెన్సిటివ్, 13 వందలు అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్‌లు ఉన్నాయి. మేడారం వెళ్లే వాళ్ళను చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది’ అని తెలిపారు.


