116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికలు
షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నేటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు
13న ఓట్ల లెక్కింపు, 16న కొలువుదీరనున్న కొత్త పాలక మండళ్లు..
నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి..
ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సి పాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఈ నెల 28న బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బుధవారం నుంచే ప్రారంభమయ్యే నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ గడువు (ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు) ముగిసిన తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
అదే నెల 11న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే విడతలో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. 13న ఓట్లు్ల లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. 16వ తేదీన కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించారు.
పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి లింగ్యా నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో ఎన్నికల సంఘం కార్యాలయంలో భేటీ అయ్యారు. కాగా షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. 
భారీ పోలీసు బందోబస్తు
ఎన్నికల ప్రక్రియను పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. అటవీ, ఎక్సైజ్ విభాగాల సిబ్బందితో కలిసి సుమారు 25 వేల మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 1,800 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా పట్టణ ప్రాంతాల్లోని లైసెన్స్ హోల్డర్లు ఆయుధాలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు సిబ్బందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదుతో పట్టుబడితే స్వాదీనం చేసుకుని రశీదు ఇవ్వడంతో పాటు అప్పీలు వివరాలు కూడా తెలియజేస్తారు. 
ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు పెంచడంతో పాటు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తారు. 1,926 పోలింగ్ స్టేషన్లు సున్నితమైనవిగా, 1,302 అత్యంత సమస్యాత్మకమైనవిగా, 4,975 సాధారణమైనవిగా గుర్తించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్, నిజామాబాద్, బోధన్ తదితర మతపరమైన సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 133 మున్సిపాలిటీలకు గాను ప్రస్తుతం పాలక మండళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు పారదర్శకంగా స్వేఛ్చాయుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.


