లోక్‌సభ స్థానాలు 850కి పెంపు! | Centre Proposes Constitution Amendment To Increase Lok Sabha Seats To 850 | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు!

Apr 15 2026 1:55 AM | Updated on Apr 15 2026 1:55 AM

Centre Proposes Constitution Amendment To Increase Lok Sabha Seats To 850

తుది సంఖ్యపై డీలిమిటేషన్‌ కమిషన్‌దే నిర్ణయం

రాష్ట్రాలకు గరిష్టంగా 815, యూటీలకు 35 

వాటిలో 280 దాకా మహిళలకు కేటాయింపు 

మహిళా రిజర్వేషన్ల అమలుకు 3 బిల్లులు 

రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం 

డీలిమిటేషన్‌కు త్వరలో కమిషన్‌ ఏర్పాటు

సాక్షి, న్యూఢిల్లీ: 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లోక్‌సభలో స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850 దాకా పెరిగే అవకాశముంది! వీటిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 815కు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 35కు మించకుండా స్థానాలుంటాయి. మహిళలకు 33 శాతం లెక్కన వాటిలో గరిష్టంగా 280 నుంచి 281 స్థానాల దాకా రిజర్వు చేయనున్నారు. దీనికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.

2029కి ముందే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, అందుకోసం లోక్‌సభ స్థానాల పెంపుకు వీలు కల్పించేలా రాజ్యాంగ (131వ)సవరణ బిల్లు–2026, దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్‌ బిల్లు–2026, ఈ ప్రక్రియను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలకు కూడా వర్తింపజేసేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026 వీటిలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకూ ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ముసాయిదా ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలందరికీ పంపింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం త్వరలో డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు కానుంది.

లోక్‌సభ స్థానాల తుది సంఖ్యను పునర్విభజన కసరత్తు అనంతరం కమిషనే ఖరారు చేయనుంది. ఈ కారణంగానే పెరగనున్న లోక్‌సభ స్థానాల సంఖ్యను రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ‘అన్ని రాష్ట్రాలకు కలిపి గరిష్టంగా 815కు మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు మించకుండా లోక్‌సభ స్థానాలుండాలి’అని మాత్రమే తెలిపారు. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే.

ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లులో వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుకు వీలుగా రాజ్యాంగంలోని పలు అధికరణలకు సవరణలను కూడా ప్రతిపాదించారు. నారీశక్తి వందన్‌ అధినియమ్‌గా పేర్కొనే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలకు పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఆమోదం పొందనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. ఈ ప్రక్రియ ఆలస్యమైతే చట్టసభల్లో విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్న మహిళలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 

2029 నుంచే అమలయ్యేలా... 
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లను మహిళలకు ప్రత్యేకిస్తారు. అయితే ఈ చట్టం 2034కు ముందు అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. మహిళా రిజర్వేషన్లు అమలవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన–2027 ప్రక్రియ ముగిసి, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పుననర్విభజన చేపట్టాల్సి ఉండటమే అందుకు కారణం. కానీ మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ‘‘తదుపరి జనగణన, దాని తర్వాత డీలిమిటేషన్‌ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.

కానీ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టడమే లక్ష్యం’’అని ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వు చేసే స్థానాలను రొటేషన్‌ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అనంతరం వాటి పొడిగింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. 

మూడు బిల్లులపై 18 గంటల చర్చ 
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్‌ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026పై గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరగనుంది. అందుకు 18 గంటల సమయం కేటాయించారు. అనంతరం వాటిపై ఓటింగ్‌ చేపడతారు. తర్వాత మూడు బిల్లులపై శనివారం రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ, అనంతరం ఓటింగ్‌ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ ఎన్నిక కూడా జరుగుతుందని పార్లమెంటు వర్గాలు 
వెల్లడించాయి.

లోక్‌సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు లబ్ధి?
లోక్‌సభ నియోజకవర్గాల పెంపులో దామాషా ప్రాతినిధ్య విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850 దాకా పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు–2026లో కేంద్రం ప్రతిపాదించింది. ‘‘వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విషయంలో దామాషా విధానాన్ని అనుసరించనున్నారు. దీనిద్వారా దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది’’అని కేంద్ర వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో వెల్లడించే అవకాశమున్నట్టు తెలిపాయి.

నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటిస్తూ వస్తున్నాయి. దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వాటిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది.  ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.

వాడీవేడిగా  సమావేశాలు 
గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచి్చందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.

డీలిమిటేషన్‌ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్‌ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కని్పస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటికే తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి.  

డీలిమిటేషన్‌కు కమిషన్‌ 
⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం 
⇒ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు 
⇒ ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులు

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్‌ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు కానుంది. దానికి సుప్రీంకోర్టు ప్రస్తుత, లేదా రిటైర్డ్‌ న్యాయమూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, లేదా ఎన్నికల కమిషనర్‌తో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల  భాగస్వామ్యం నిమిత్తం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున అసోసియేట్‌ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్, ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్‌ చేస్తారు.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరగడం, జనాభా పెరుగుదల రేటులో మార్పులతో నియోజకవర్గాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరి్టకల్‌ 81, ఆరి్టకల్‌ 55కు కీలక సవరణలు చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునర్‌ వ్యవస్థీకరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement