డీలిమిటేషన్‌ బిల్లుకు ఆమోదం | Union Cabinet clears draft bill for amendments to Women Reservation Act | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌ బిల్లుకు ఆమోదం

Apr 9 2026 4:20 AM | Updated on Apr 9 2026 6:24 AM

Union Cabinet clears draft bill for amendments to Women Reservation Act

సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ చట్ట సవరణకు, లోక్‌సభ స్థానాల పెంపుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు.

 ఈ నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్‌ అధినియమ్‌ చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టనున్నారు. దానితో పాటు డీలిమిటేషన్‌ బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్‌ 16 నుంచి 18 దాకా పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుండటం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్‌ సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లు
ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంపు నిర్ణయానికి కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అందుకు రూ.41,533.81 కేటాయించారు. 2025 ఖరీఫ్‌ సీజన్‌ బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,317 కోట్లు అదనమని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు భారీగా పెరిగినా రైతులకు మాత్రం 50 కిలోల బస్తాను రూ.1,350కే అందుబాటులో ఉంచుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా రాయితీని హేతుబద్ధీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘రూ.13 వేల కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో కూడిన జైపూర్‌ మెట్రో రెండో దశకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇది 36 స్టేషన్లతో 41 కి.మీ. మేరకు ఉంటుంది’’ అని వైష్ణవ్‌ వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement