seats in parliament
-
డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు, లోక్‌సభ స్థానాల పెంపుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టనున్నారు. దానితో పాటు డీలిమిటేషన్ బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి 18 దాకా పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుండటం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లుఖరీఫ్ సీజన్‌కు ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంపు నిర్ణయానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందుకు రూ.41,533.81 కేటాయించారు. 2025 ఖరీఫ్ సీజన్ బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,317 కోట్లు అదనమని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు భారీగా పెరిగినా రైతులకు మాత్రం 50 కిలోల బస్తాను రూ.1,350కే అందుబాటులో ఉంచుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా రాయితీని హేతుబద్ధీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘రూ.13 వేల కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో కూడిన జైపూర్ మెట్రో రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 36 స్టేషన్లతో 41 కి.మీ. మేరకు ఉంటుంది’’ అని వైష్ణవ్ వివరించారు. -
పార్లమెంట్ సీట్లు పెరగాలి
► చట్టాలను సవరించేందుకు ఇదే సమయం ► పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు అవసరం ► రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పద్ధతిలో పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచేందుకుగానూ చట్టపరమైన నిబంధనలను సవరించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రస్తుత భారత పార్లమెంటరీ వ్యవస్థలో తక్కువ సీట్లు ఉన్న రాజకీయ పార్టీలు కూడా సమానమైన హక్కులను పొందుతున్నాయని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యం చూపుతున్నా.. ఎటువంటి బాధ్యతా వారిపై ఉండటంలేదని అన్నారు. శనివారం ఢిల్లీలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి జరిగిన సెమినార్లో సీజేఐ జస్టిస్ ఖేహర్‌తో కలసి ప్రణబ్ పాల్గొన్నారు. సీజేఐ ఖేహర్ మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాలను రాజకీయ పార్టీలు నెరవేర్చడం లేదని, పార్టీ మేనిఫెస్టోలను కాగితం ముక్కల మాదిరిగా చూస్తున్నారని, పార్టీలకు ఎటువంటి జవాబుదారీతనం లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పేర్కొన్నారు. సీజేఐ సందర్భానుసారం జవాబుదారీతనం గురించి లేవనెత్తారని, కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వందకు 51(మెజారిటీ) వస్తే వారికి అధికారం, అన్ని హక్కులు సంక్రమించేలా మన ఎన్నికల ప్రక్రియ ఉందని, అలాగే 51 కంటే తక్కువ వచ్చిన వారు కూడా అన్ని అధికారాలు, హక్కులను పొందుతున్నారని, కానీ వారికి ఎటువంటి జవాబుదారీతనం ఉండటం లేదని ప్రణబ్ ఈ సందర్భంగా చెప్పారు. -
చట్టసభలకు నో ఎంట్రీ
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : అన్నింటా సగం అంటున్నా... అతి ముఖ్యమైన చట్టసభలకు మాత్రం మహిళలకు అవకాశం రావడం లేదు. రాజకీయ వేదికలపై మహిళా సాధికారతపై ఉపన్యాసాలతో కలల ప్రపంచాన్ని చూపించే నేతలు వాస్తవ స్థితిలో చట్టసభల దరిచేరనీయడం లేదు. దశాబ్దకాలంగా జిల్లానుంచి ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే, ఎంపీగా చట్టసభల్లోకి ప్రవేశించిన దాఖలా లేదు. జిల్లాలో మహిళల పట్ల వివక్షతను చూపించడంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి. జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, ఈ నియోజకవర్గాల్లో పురుషాధిక్యతే కొనసాగుతూ వస్తోంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండడం, చట్టసభల్లో లేకపోవడంతో అన్ని పార్టీలు మహిళలను స్థానిక పదవులకే పరిమితం చేస్తున్నాయి. చివరిసారిగా 1999లో సుగుణకుమారి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించి, 2004 వరకు కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరే మహిళా నాయకురాలు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అలంకరించలేదు. అంతకుముందు కూడా చరిత్ర గొప్పగా లేదు. 62 ఏళ్ల గణతంత్ర రాజకీయ చరిత్రలో జిల్లా నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలకు మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం లభించింది. అందులో ఒకరు కేవలం ఆరు నెలలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేలుగా, ఒకరు ఎంపీగా విజయం సాధించి మహిళలకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుతామని ప్రపంచానికి తెలియచేశారు. 1952లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరపున రాజమణిదేవి ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా నుంచి తొలిసారి చట్టసభలకు వెళ్లిన మహిళగా రికార్డుకెక్కారు. 1972లో అప్పటి నుస్తులాపూర్ నియోజకవర్గంలో ఇందిరాకాంగ్రెస్ పార్టీ నుంచి ప్రేమలతాదేవి ఎన్నికయ్యారు. నగరంలోని కార్ఖానగడ్డకు చెందిన ప్రేమలతాదేవి అంతకుముందు 1964లో ఇన్చార్జి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, 1965 నుంచి 68 వరకు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1998లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెట్పల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొమొరెడ్డి జ్యోతి ఆరు నెలల స్వల్పకాలంతోనే సరిపెట్టుకున్నారు. అనంతరం ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుగుణకుమారి పెద్దపల్లి నుంచి మూడు పర్యాయాలు టీడీపీ నుంచి పోటీచేసి 1998, 1999లో రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. రెండు మార్లు రాజకీయ దిగ్గజం వెంకటస్వామిని ఓడించి మహిళలకు అవకాశం కల్పిస్తే చరిత్ర తిరుగరాస్తారని నిరూపించారు. ఆ తరువాత ఇప్పటివరకు ఎవరికీ అవకాశం దక్కలేదు సరికాదా, సుగుణకుమారికి మినహా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా మహిళలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం అడపాదడపా తప్ప మహిళలకు పోటీచేసే భాగ్యం కూడా దక్కకపోవడం దారుణం. గుడ్ల మంజుల, గండ్ర నళిని, బల్మూరి వనిత, అంబళ్ల భాగ్యవతి తదితరులకు మాత్రమే వివిధ పార్టీల నుంచి కనీసం ఎమ్మెల్యేలుగా పోటీచేసే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనూ అంతే... గత వివక్షతకు కొనసాగింపా... అన్నట్లు... తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 2014 సాధారణ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ నుంచి మహిళలు చట్టసభలకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్లలో జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ పదవుల్లో మహిళా నేతలు ఉన్నప్పటికీ, ఎన్నికల్లో మాత్రం వారికి అవకాశం దక్కేట్లు కనిపించడం లేదు. రాజకీయ పార్టీల్లో పురుషాధిక్యం మూలంగా తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి ఎమ్మెల్యే, ఎంపీలుగా చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం మహిళలకు కనిపించడం లేదు.


