ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 37 లేదా 38కి పెరిగే అవకాశం
పునర్విభజనతో సమూలంగా మారనున్న నియోజకవర్గాల రూపురేఖలు
పెరగనున్న మంత్రుల కోటా
ప్రస్తుతం సీఎంతో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 26.. పునర్విభజన తర్వాత మంత్రివర్గం కోటా 39కి పెరిగే చాన్స్
సాక్షి, అమరావతి: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో శాసనసభ, లోక్‌సభ స్థానాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో లోక్‌సభ, 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన గంపగుత్తగా 50 శాతం స్థానాలను పెంచడం.. 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ (ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌తో కలిపి) చేస్తూ రూపొందించిన మార్గదర్శకాలతో కూడిన బిల్లుపై బుధవారం కేంద్ర కేబినెట్ చర్చించనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక.. పెరిగే నియోజకవర్గాలతోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం అంటే 86 లేదా 87 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఇక లోక్‌సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరగనున్నాయి. అందులో మహిళలకు 33 శాతం అంటే 12 లేదా 13 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు.
నియోజకవర్గాల్లో సమూల మార్పు..
ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాసనసభ స్థానాలను ఎస్సీలకు, ఏడు శాసనభ స్థానాలకు ఎస్టీలకు రిజర్వు చేశారు. నాలుగు లోక్‌సభ స్థానాలు (చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం) ఎస్సీలకు, ఒక లోక్‌సభ స్థానం(అరకు) ఎస్టీలకు రిజర్వు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఎస్సీల జనాభా గరిష్టంగా ఉండే లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. 
ఎస్టీల జనాభా గరిష్టంగా ఉండే లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని లోక్‌సభ స్థానాల పరిధిలోనూ ఏడు చొప్పున శాసనసభ స్థానాల ఉన్నాయి. కానీ.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్కో రీతిలో శాసనసభ స్థానాల ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. లోక్‌సభ నియోజకవర్గాల స్వరూపం సమగ్రంగా మారిపోనుంది. ఇక శాసనసభ స్థానాల స్వరూపం కూడా సమగ్రంగా మారనుంది.
పెరగనున్న మంత్రివర్గం కోటా:
శాసనసభ స్థానాల్లో 15 శాతం లోపు సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ప్రస్తుతం శాసనసభలో 175 స్థానాలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 26కి మించకూడదు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ స్థానాల సంఖ్య 262 లేదా 263కు పెరగనుంది. ఆ మేరకు మంత్రివర్గం కోటా కూడా 26 నుంచి 39కి పెరగనుంది.


