అండర్–19 పురుషుల వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. తద్వారా శ్రీలంక సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 261 పరుగులు సాధించింది.
ఓపెనర్ జోరిచ్ వాన్ వాన్ షాల్క్విక్ (116; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. అతడితో పాటు అద్నాన్ లగాడియన్(46), జేమ్స్(47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో విఘ్నేశ్వరన్ ఆకాశ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం శ్రీలంక 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ విరాన్ చముదిత (110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించి శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఐర్లాండ్‌తో నేడు జరిగే ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓడిపోతేనే శ్రీలంక సెమీఫైనల్ చేరుకుంటుంది. అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. గ్రూప్–1 నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుకుంది.
సౌతాఫ్రికా అవుట్
కాగా ఈ ఓటమితో వరల్డ్‌కప్ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించింది. సూపర్-6లో ప్రోటీస్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ పరాజయం పాలైంది. దీంతో గ్రూపు-1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ జట్లు ఇంటిముఖం పట్టాయి. ఈ టోర్నీ అసాంతం సఫారీలు దారుణ ప్రదర్శన కనబరిచారు. లీగ్ స్టేజిలోనూ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
చదవండి: SA vs WI 2nd T20I: డికాక్ విధ్వంసకర సెంచరీ.. 222 టార్గెట్ హాంఫట్


