ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన టీ20 ప్రపంచ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తొలి టీ20 సందర్భంగా స్టిర్లింగ్ ఈ ఘనత సాధించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్ జట్టు.. యూఏఈ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. గురువారం తొలి టీ20 జరిగింది. దుబాయ్ వేదికగా టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.
మెరుపు ఇన్నింగ్స్
ఓపెనర్లలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (8) విఫలం కాగా.. రాస్ అడేర్ (39) మెరుగ్గా రాణించాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్ (25 బంతుల్లో 38), కర్టిస్ కాంఫర్ (25) ఫర్వాలేదనిపించగా.. బెంజమిన్ కలిజ్ (12 బంతుల్లో 26 నాటౌట్), జార్జ్ డాక్రేల్ (10 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి, హైదర్ అలీ చెరో రెండు.. ముహమ్మద్ అర్ఫాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 121 పరుగులకే యూఏఈ ఆలౌట్ అయింది.
57 పరుగుల తేడాతో విజయం
ఐర్లాండ్ బౌలర్లు మాథ్యూ హాంప్రేస్, గరేత్ డెలాని తలా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. బారీ మెకార్తి రెండు వికెట్లు పడగొట్టాడు. జార్జ్ డాక్రేల్, మార్క్ అడేర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి టీ20లో ఐర్లాండ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.
ఇక పాల్ స్టిర్లింగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఇది 160వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. తద్వారా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును స్టిర్లింగ్ బద్దలు కొట్టాడు. కాగా 2024లో టీమిండియాకు టీ20 వరల్డ్‌కప్ అందించిన తర్వాత అంతర్జాతయ టీ20లకు రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 2009- 2026*- 160 మ్యాచ్‌లు
రోహిత్ శర్మ (ఇండియా): 2007-2024- 159 మ్యాచ్‌లు
జార్జ్ డాక్రేల్ (ఐర్లాండ్): 2010-2026*- 153 మ్యాచ్‌లు
మహ్మద్ నబీ (అఫ్గనిస్తాన్): 2010-2026- 148 మ్యాచ్‌లు
జోస్ బట్లర్ (ఇంగ్లండ్): 2011-2025- 144 మ్యాచ్‌లు.
చదవండి: Kohli Instagram Deactivate: ఇన్‌స్టాకు గుడ్‌బై ?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్!


