వందేళ్ల వేడుకల్లో పాల్గొన్న దిగ్గజాలు
అలరించిన ఎగ్జిబిషన్ మ్యాచ్
ఆకట్టుకున్న ఫొటో గ్యాలరీ
న్యూఢిల్లీ: భారత హాకీ శతాబ్ది వేడుక ఓ పెద్ద పండగలా నిర్వహించారు. మన జాతీయ క్రీడ అయిన హాకీకి వంద వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రముఖ మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో కేంద్ర క్రీడాశాఖ, హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఇందులో అలనాటి ఒలింపిక్ చాంపియన్లు గుర్‌బక్ష్ సింగ్, అస్లాం షేర్ ఖాన్ తదితర దిగ్గజాలు పాల్గొన్నారు. తదుపరి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వీరందరిని హాకీ ఇండియా పెద్దలు ఘనంగా సత్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖాడ్సే... తమ అసమాన ప్రతిభా పాఠవాలతో హాకీ క్రీడకే వన్నెతె చ్చిన గుర్‌బక్ష్, అస్లామ్, హర్బిందర్, అజిత్ పాల్ సింగ్, అశోక్ కుమార్ (దివంగత దిగ్గజం ధ్యాన్‌చంద్ కుమారుడు), బీపీ గోవింద, జఫర్ ఇక్బాల్, బ్రిగేడియర్ హర్‌చరణ్ సింగ్, వినీత్ కుమార్, మీర్ రంజన్ నేగి, రోమియో జేమ్స్, అసుంత లాక్రా, సుభద్ర ప్రధాన్‌లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరంతా హాకీ దిగ్గజాల నిరుపమాన సేవల్ని కొనియాడారు. ‘హాకీ క్రీడ ఎన్నో దశల్ని దాటింది. ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో హాకీ ద్వారా భారత్ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి మనం చూపించాం. ఆ తర్వాత ఈ క్రీడలో భారత్ ఏడాడూ వెనక్కి తిరిగిచూసుకునే అవసరమే రాలేదంటే ఈ దిగ్గజాల విశేష కృషే కారణం.
ఘనమైన చరిత్ర కలిగిన హాకీ ఇకముందు కూడా ఘనమైన విజయాలతో ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తుంది’ అని క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ముందుగా వందేళ్ల వేడుకకి ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో శ్రీకారం చుట్టారు. మాండవీయ నేతృత్వంలోని స్పోర్ట్స్ మినిస్టర్స్ ఎలెవన్, హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీ సారథ్యంలో హాకీ ఇండియా జట్ల మధ్య ఈ మ్యాచ్ సరద సరదాగా జరిగింది.
మహిళలు, పురుషులు కలిసే ఈ మ్యాచ్ ఆడారు. ఇందులో సోŠప్‌ర్ట్స్ మినిస్టర్ జట్టు 3–1తో గెలుపొందింది. డుంగ్ డుంగ్, సలీమా టేటే, కృష్ణ ప్రసాద్‌లు చెరో గోల్ చేశారు. హాకీ ఇండియా తరఫున ఏకైక గోల్‌ను మన్‌ప్రీత్ సింగ్ సాధించాడు. అ సందర్భంగా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన చిరస్మరణీయ స్వర్ణ పతక విజయాలకు సంబంధించిన ఆ పాత మధురాలకు సంబంధించిన ఫొటో గ్యాలరీ ఆకట్టుకుంది. తన ప్రయాణం మొదలైన ఈ క్రీడ వందేళ్ల వేడుకలో పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందని దిలీప్ టిర్కీ అన్నారు.
శతాబ్ది హాకీకి మైలురాయిలా నిలిచేలా దేశవ్యాప్తంగా 500 పైచిలుకు జిల్లాల్లో వెయ్యికి పైగా మ్యాచ్‌ల్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో పలువురు జాతీయ క్రీడాకారులతో పాటు పాఠశాల స్థాయి విద్యార్థులు సుమారు 36, 000 మంది పాల్గొన్నట్లు క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలోనే తమిళనాడు జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వబోతోంది.
ఈసందర్భంగా దేశంలోని 20 ప్రధాన నగరాల్లో ప్రపంచకప్ టూర్ జరుగుతోంది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మదురై నగరాల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం 24 జట్లు ఆరు గ్రూపుల్లో తలపడతాయి.


