పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకలు
దేశ విదేశాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
పది రోజుల పాటు వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు
జయంతి వేడుకలకు తరలివచ్చిన ప్రముఖులు
భక్తుల సౌకర్యార్థం పలు చోట్ల బస ఏర్పాట్లు
పది రోజుల పాటు అన్నదాన కార్యక్రమం
పుట్టపర్తిలో వేడుకల కోసం ప్రత్యేక భద్రత, ముమ్మర నిఘా
శతజయంతి వేడుకలతో పుట్టపర్తిలో పండుగ వాతావరణం
సత్యసాయిబాబా తన జీవన ప్రస్థానంలో సత్య ధర్మ శాంతి ప్రేమలనే విలువలను బోధిస్తూ, మానవాళిని విలువైన జీవన మార్గం వైపు పయనింపజేశారు. ఆధ్యాత్మిక బోధనలతో అజ్ఞానాంధకారాన్ని పారదోలుతూ భక్త కోటిలో చైతన్యకాంతులు నింపారు. ప్రేమను పంచే ప్రేమమూర్తిగా, సేవకు ప్రతి రూపంగా; ఉచితంగా తాగునీరు, విద్య, వైద్య సేవలను అందించి సేవాప్రదాతగా కీర్తి గడించారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆపదలో భక్తులను ఆదుకునే ఆపద్బాంధవుడిగా, ఆరాధ్య దైవంగా భక్తుల మదిలో గూడుకట్టుకున్న సత్యసాయి నిర్యాణం చెంది పద్నాలుగేళ్లు పూర్తవుతున్నా, భక్తులు మాత్రం ఆయననే తమ శ్వాసగా, ధ్యాసగా కొలుస్తున్నారు. సత్యసాయి జయంతిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు పుట్టపర్తిలో జరుగుతున్న జయంతి వేడుకలకు తరలి వచ్చి భక్త నీరాజనాలు అర్పిస్తున్నారు.
కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని అప్పటి కుగ్రామమైన పుట్టపర్తిలో 1926 నవంబర్ 23న ఈశ్వరాంబ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి జన్మించారు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉన్న సత్యసాయి, తన 14 వ ఏట తాను సత్యసాయి బాబాను, భూమిపై ధర్మ పరిరక్షణకు అవతరించినట్లు ప్రకటించుకున్నారు. నాటి నుంచి పుట్టపర్తిలో మందిరం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు వినిపిస్తూ, తనను ఆరాధించే భక్తులను దగ్గరకు చేర్చుకున్నారు.
మానవ సేవయే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి, ఒక వైపు ఆధ్యాత్మిక బోధనలతో మానవాళిని చైతన్యవంతులను చేస్తూనే, కనీస అవసరాలకు నోచుకోని బడుగు జీవులకు సేవలందించే మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి విద్య, వైద్యం, తాగునీరు ఉచితంగా అందించే కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రకృతి విపత్తులు సంభవించే సమయాల్లో తన సేవాదళ్ విభాగాల ద్వారా బాధితులకు సేవలు అందిస్తున్నారు.
కేజీ నుంచి పీజీ వరకు
విద్య మనిషిని అవివేకం నుంచి వివేకవంతుణ్ణి చేస్తుందని విశ్వసించిన సత్యసాయిబాబా.. పుట్టపర్తి కేంద్రంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మానవతా విలువలతో కూడిన విద్యను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యూనివర్శిటీని (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) ఏర్పాటు చేశారు. పుట్టపర్తి, నందిగిరి, అనంతపురం, బెంగళూరు సమీపాన బృందావనం వద్ద నాలుగు క్యాంపస్‌లు నిర్వహిస్తున్నారు. అనంతపురం క్యాంపస్ ద్వారా మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారు.
ప్రతి ఏటా సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు సత్యసాయి విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్యను పొందుతున్నారు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2010లో విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశీయంగా 126 పాఠశాలలు ఈ పథకం ద్వారా విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా విద్యను పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు.
పైసా ఖర్చు లేకుండా
‘వైద్యో నారాయణ హరి’ అనే నానుడిని సాకారం చేస్తూ సత్యసాయి ఉచిత వైద్యసేవకు ప్రాధాన్యం ఇచ్చారు. పుట్టపర్తి ప్రాంతంలో పేదలు వైద్యం అందక బాధలు పడుతున్నారని, ఒక ఆసుపత్రి నిర్మించాలని తల్లి ఈశ్వరాంబæకోరగా, తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి పుట్టపర్తిలో 1956లో పుట్టపర్తి నడిబొడ్డున 30 పడకల జనరల్ ఆసుపత్రి నిర్మించారు. తర్వాత 1991లో ఆధునిక వసతులతో కూడిన శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆసుపత్రుల ద్వారా రోగులు ఉచితంగా ఖరీదైన వైద్యసేవలు పొందుతున్నారు.
ఉచిత తాగునీటి సరఫరా
నిత్యం కరవుతో అల్లాడే రాయలసీమలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాయలసీమ ప్రజల కష్టాలను చూసి చలించిన సత్యసాయి 1995 నవంబర్‌లో రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు సత్యసాయి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 1,400 గ్రామాలు ఈ పథకం ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరు నుంచి ‘సత్యసాయి తాగునీరు’ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ సుమారు 20 లక్షల మంది సత్యసాయి తాగునీటి పథకం వినియోగించుకుంటున్నారంటే.. సాయి సంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.


