ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి శతవర్ష జయంతి వేడుక
హాజరైన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్, చీఫ్ జస్టిస్‌లు
ప్రశాంతి నిలయం: సత్యసాయి మానవతా విలువల బోధనతోపాటు నిస్వార్థసేవలతో సమాజాన్ని మానవత్వం వైపు నడిపారని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా బాబా సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మానవతా వాదులు, భక్తులందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయి శతవర్ష జయంతి వేడుకలు ఆదివారం అశేష భక్తుల నడుమ విశ్వవేడుకలా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి బాబా అహింస, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచారన్నారు. తన చిన్నతనంలో తమిళం మాత్రమే మాట్లాడే తన అత్త సుదూరంలో ఉండే పుట్టపర్తికి వచ్చి 15రోజులు ఇక్కడే నుండి సత్యసాయి ఆశీర్వాదాలు పొందడం బాబా దైవిక శక్తికి నిదర్శనమని చిన్ననాటి అనుభవాన్ని స్మరించుకున్నారు.
‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’ అన్న సత్యసాయి నినాదాలు కోట్లాది గుండెలను కదిలించాయన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలు కోట్లాది మంది ప్రజలకు జీవనాడిగా ఉన్నాయన్నారు. ప్రపంచం ఘర్షణలు, ఒత్తిడితో నిండిన పరిస్థితులలో సత్యసాయి చూపిన మార్గం వాటికి పరిష్కారం చూపగలదన్నారు. ఆధ్యాత్మిక, సేవాస్ఫూర్తి సత్యసాయి నేటి తరానికి ఇచి్చన వారసత్వం అన్నారు. రాబోయే తరానికి బాబా వారసత్వాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిçÜ్తూ అందించాలని పిలుపునిచ్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు మాట్లాడుతూ.. సత్యసాయి సంకల్ప బలం కుగ్రామం పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిందన్నారు.
సత్యసాయి నిరాడంబరతతో మానవాళికి నిస్వార్థ సేవలు అందించి ప్రేమ మూర్తిగా, సేవా స్ఫూర్తిగా కోట్లాది మంది భక్తులను సేవామార్గం వైపు నడిపారన్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. బాబా మానవాళి శ్రేయస్సు కోసం ఏడు దశాబ్దాల క్రితం స్థాపించిన సత్యసాయి ట్రస్ట్ ప్రపంచవ్యాప్త సేవా ఉద్యమంగా మారిందని, ఇది సత్యసాయి సంకల్ప బలానికి నిదర్శనమని అన్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాలలో సత్యసాయి అందించిన సేవలు ఎంతో గొప్పవన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సత్యసాయి అవతార పురుషుడన్నారు. మానవతా విలువలను, ఆధ్యాత్మిక చింతనను బోధిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం నేటి తరం బాధ్యత అన్నారు.
కనుల పండువగా స్వర్ణ రథోత్సవం
ఆదివారం ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవం కనుల పండువగా సాగింది. దేశం నలుమూలల నుంచి తరలివచి్చన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, భక్తులు ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సత్యసాయి బోధనలు, సూక్తుల ప్లకార్డులను చేతబూని, నృత్య ప్రదర్శనలతో ముందు సాగగా.. ఆ వెనుక సత్యసాయి స్వర్ణ రథం కదిలింది. ‘కదిలింది.. కదిలింది సాయి రథం.. స్వర్ణరథం’ అంటూ ప్రముఖ గాయకుడు మను గానానికి అనువుగా భక్తులు ఆనంద డోలికల్లో తేలుతూ రథోత్సవాన్ని సాగించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బాలవికాస్ చిన్నారులు మానవతా విలువలను చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మైమరపించాయి. సాయంత్రం సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు.
ప్రజల్లో దేవుడిని చూసిన మహానుభావుడు: సీఎం రేవంత్
సత్యసాయి ప్రజల్లో దేవుడిని చూస్తూ మానవసేవే మాధవ సేవ అని నిరూపించిన మహానుభావుడని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బాబా తన ప్రేమతో మనుషుల్ని గెలిచారని, ప్రేమతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని చెప్పారు. ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను సత్యసాయి చేసి చూపించి తన సంకల్ప బలాన్ని చాటుకున్నారు. పేదలకు ఉచిత వైద్యం లాంటి తన సేవలతో దేవుడిగా పూజింపబడుతున్నారు.
గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి కల్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది. మనతో పాటు ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలలో బాబా స్ఫూర్తి నింపారు.
తెలంగాణలోనూ ఉత్సవాలు
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు రావడం ఈ నేల పవిత్రతను తెలియజేస్తోంది. బాబా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించాం. తెలంగాణలో బాబా సేవలను విస్తృతం చేసేందుకు మా ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.


