భక్తిరస కథాచిత్రాలు అరుదుగా ఉంటాయి. ఈ మధ్య విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అనంత అనే భక్తిరస కథాచిత్రం సంక్రాంతి సందర్భంగా మంగళవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇది పుట్టపర్తి సాయిబాబా దైవలీలల గురించి చెప్పే సినిమా.
అనంత సినిమా
ఇంతకుముందు బాషా, అన్నామలై వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సురేశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీశ్ కృష్ణమూర్తి నిర్మించారు. జగపతిబాబు, సుహాసిని, వైజీ.మహేంద్రన్, నిగల్‌గళ్ రవి, తలైవాసల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, గీత రచయిత స్నేషన్ మాటలు, పాటలు అందించారు.
జీవిత చరిత్ర కాదు
ఇది సాయిబాబా జీవిత చరిత్ర కాదని, ఆయన మహిమలతో కూడిన భక్తిరస కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మితే ఫలితాలెలా ఉంటాయన్నది చెప్పే సినిమాయే అనంత అన్నారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారన్నారు. దేవా సంగీతం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు.
ఓటీటీలో నేరుగా రిలీజ్
సినిమా చూసిన పలువురు ప్రముఖులు థియేటర్లలో విడుదల చేయమని కోరారన్నారు. అయితే ఓటీటీ సంస్థ కమిట్ అవడంతో హాట్‌స్టార్‌కు స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చామన్నారు. ఈ సినిమా మంగళవారం అంటే జనవరి 13 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.


