తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. హీరోగా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. అవసరమైతే అతిథి పాత్రలో కనిపించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. జైలర్ 2లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం.
అలాంటి రోల్స్ చేయను
ఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నవారి దగ్గరినుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అలా జైలర్ 2లో ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చాలామంది విలన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. హీరోను ఎలివేట్ చేసే విలన్ పాత్రలు చేయడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు.
మూకీ సినిమాతో..
కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ పంచే విలన్ పాత్రల్ని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం 'గాంధీ టాక్స్'. మూకీ (మాటలు లేని) సినిమాగా తెరకెక్కిన గాంధీ టాక్స్ జనవరి 30న విడుదలవుతోంది. ఈ మూవీలో అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్దార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.


