తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక భక్తులను సంపాదించుకున్న సత్య సాయిబాబా (Sri Sathya Sai Baba) ముఖ్యంగా సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రంగాలలోనూ సత్య సాయిబాబా భక్తులు ఉన్నారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన ఎందరో ప్రముఖలు, పారిశ్రామికవేత్తలూ ఆయన సేవలో తరించారు. సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా వారిలో కొందరి గురించి..
ర్యుకో హిరా: జపాన్‌కు చెందిన హెచ్‌ఎంఐ హోటల్ గ్రూప్ వ్యవస్థాపకులు. ప్రముఖ అంతర్జాతీయ సాయి భక్తులలో ఒకరు. ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ దాత ఈయనే. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ధర్మకర్తగా కూడా ఉన్నారు.

రతన్ టాటా: టాటా సన్స్ దివంగత చైర్మన్. సాయిబాబా కార్యక్రమాలకు హాజరై ఆయన పట్ల గౌరవప్రదమైన ఆధ్యాత్మిక అభిమానాన్ని కొనసాగించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమ రూపకల్పనకు సహాయ సహకారాలందించారు.
ఇందులాల్ షా: చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఈయన వ్యాపార వర్గాలలో ప్రముఖుడిగా పేరు గాంచారు. సాయి సంస్థల ప్రపంచ విస్తరణలో కీలక పాత్ర పోషించారు.
ఏవీఎస్ రాజు: పారిశ్రామికవేత్త, ఎన్‌సీపీ (నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ) వ్యవస్థాపకుడు. సాయిబాబాకు అత్యంత భక్తుడు. సాయిబాబాపై అనేక పుస్తకాలు రాశారు.
మనోహర్ శెట్టి: ఆతిథ్య, మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపారవేత్త. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తిలో అనేక సేవ, నిర్మాణ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.
వేణు శ్రీనివాసన్: టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్. బాబా దీర్ఘకాల భక్తుడు. సాయిబాబాతో తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి పలుసార్లు పంచుకున్నారు. అనేక సాయి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

లియో ముత్తు: లియో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (తమిళనాడు) వ్యవస్థాపకుడు. సాయి బోధనల ప్రభావానికి గురై ఆయనకు భక్తుడిగా మారారు.
క్రిస్ గోపాలకృష్ణన్: యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన సత్యసాయి ఆరాధకుడిగా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.


