ప్రయాగ్‌రాజ్: ఉత్తరాదిన ‘మాఘ మేళా’ శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. దీంతో పుణ్య స్నానాలు చేసేందుకు జనం కుంభమేళా తరహాలో తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణి సంగమం వద్ద ‘పుష్య పౌర్ణమి’ని పురస్కరించుకుని మాఘమేళా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
గజగజ వణికించే చలిని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నేడు(శనివానం) దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు గంగానది, సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తారనే అంచనాలున్నాయని ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల సమయానికే సుమారు 9 లక్షల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘పుష్య పౌర్ణమి’ మొదలు భక్తుల అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక దీక్ష ‘కల్పవాసం’ చేపడతారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ దీక్షలో భాగంగా భక్తులు ప్రతిరోజూ రెండుసార్లు గంగానదిలో స్నానం చేస్తూ, రోజుకు ఒకే పూట భోజనం చేస్తారు.
#WATCH प्रयागराज, उत्तर प्रदेश: माघ मेला अधिकारी ऋषि राज ने कहा, "आज पौष पूर्णिमा के अवसर पर माघ मेला शुरू हो गया है। सभी घाटों पर स्नान चल रहा है। हम अभी संगम क्षेत्र में हैं और सभी इंतज़ाम पूरे हो चुके हैं। हमारे पास यहां पर्याप्त संख्या में चेंजिंग रूम उपलब्ध हैं...आज सुबह 8… https://t.co/lMqHT0ctcD pic.twitter.com/MDa6EL2pQU
— ANI_HindiNews (@AHindinews) January 3, 2026
ఈ దీక్షా రోజుల్లో ఇష్టదైవ ప్రార్థనలో, ధ్యానంలో భక్తులు కాలం గడుపుతారు. త్రివేణి సంగమం ఆరతి సేవా సమితి అధ్యక్షుడు ఆచార్య రాజేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం సుమారు 5 లక్షల మంది భక్తులు శనివారం ఈ కల్పవాస దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షతో పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కాగా భక్తుల సౌకర్యార్థం రద్దీని దృష్టిలో ఉంచుకుని మేళా యంత్రాంగం ప్రయాగ్‌రాజ్‌లో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కల్పవాసుల కోసం తొలిసారిగా ‘ప్రయాగ్‌వాల్’ పేరుతో ఒక ప్రత్యేక టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేసినట్లు ఏడీఎం దయానంద్ ప్రసాద్ తెలిపారు.
‘ప్రయాగ్‌వాల్’ నగరంలోని నాగవాసుకి ఆలయానికి ఎదురుగా ఉంది. భక్తుల సౌకర్యార్థం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 స్నాన ఘాట్లు, నదిపై ప్రయాణానికి తొమ్మిది పాంటూన్ వంతెనలను నిర్మించారు. ఉదయం వేళ చలి తీవ్రత కారణంగా భక్తుల సంఖ్య స్వల్పంగా తక్కువగా ఉన్నప్పటికీ, సమయం గడిచేకొద్దీ రద్దీ పెరుగుతూవస్తోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పుణ్యస్నానాలు కొనసాగుతాయని ప్రయాగ ధామ్ సంఘ్ అధ్యక్షుడు రాజేంద్ర పాలివాల్ పేర్కొన్నారు.
మాఘమేళా- 2026 ప్రధాన ఘట్టాలు
మాఘమేళాలో పుష్య పూర్ణిమ అనేది మొదటి ప్రధాన ఘట్టం. ఫిబ్రవరి 15న మహాశివరాత్రితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. రానున్న రోజుల్లో మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 18), వసంత పంచమి (జనవరి 23), మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి ఒకటి) తదితన కీలక పర్వదినాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏర్పాట్లు పటిష్టంగా ఉండటంతో ప్రశాంతంగా, ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో పుణ్యస్నానాలు ఆచరించగలుగుతున్నామని పలువురు భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ‘పచ్చందనమే పచ్చదనమే’.. గార్డెన్ సిటీకి పూర్వ వైభవం


