సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలను తెరిచారు. అనంతరం నిత్య కైంకర్యాలు పూర్తి చేసి వేకువజాము 1:25 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా కేవలం 2–3 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం మూడు గంటల పాటు మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.
ఉదయం 4:30 గంటల నుంచి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన టైమ్ స్లాట్ల ప్రకారం సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు ఈవో వివరించారు. టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో అనౌన్స్‌మెంట్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ మధ్య తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు తాజా అప్‌డేట్స్ అందిస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా సుమారు 3,500 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శనంలో ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా దర్శనం చేసుకున్నారు.
నిర్మాత బండ్ల గణేష్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, క్రికెటర్ తిలక్ వర్మ, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీ భరత్, దేవినేని అవినాష్ తదితరులు వైకుంఠ ద్వార దర్శనంలో తరించారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


