మంచిమాట
ఆధునిక ప్రపంచంలో ప్రతి వ్యక్తి శాంతిని పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే కేవలం ఆధ్యాత్మిక సూత్రాల ద్వారానో లేదా మార్కెట్ నుండి వస్తువుగానో ప్రశాంతత పొందలేము. అలాగే గ్రంథాల జ్ఞానం ద్వారా లేదా జీవితంలో ఉన్నత స్థానం ద్వారా కూడా దానిని పొందలేము.
‘నాకు ప్రశాంతత కావాలి’ అని పరితపించేవారు ముందుగా ‘నేను, నాకు, నాది’ అనే స్వార్థాన్ని విడనాడాలని, అలాగే, ‘ఇది ఎలాగైనా నా సొంతం కావాల్సిందే’ అనే దురాశను తొలగించుకోవాలి. అప్పుడే అన్ని అశాంతులూ తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుందంటారు భగవాన్ సత్యసాయి బాబా.
నిష్కామ కర్మ ఆచరిస్తూ, ఆధ్యాత్మిక ధర్మాలను పాటిస్తూ, జ్ఞాన చక్షువులతో అందరిలో, అన్నింటిలో ఆ దైవాన్ని దర్శించడమే అసలైన వేదాంతం అంటారు సాయి. భగవాన్ చెప్పిన ‘అందరినీ ప్రేమించు అందరినీ సేవించు’ అనే ఒక్క మహా వాక్యం అందరి జీవితాలను ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మహాబోధ. మోక్షానికి దగ్గర చేసే మార్గం.
‘ప్రచారం, ఆర్భాటం, ప్రదర్శన కోసం చేసే సేవ మీ కీర్తిప్రతిష్ఠలు పెంచవచ్చునేమో కానీ అది సమాజానికి మంచి సందేశాన్ని, స్ఫూర్తిని ఇవ్వలేదు’ అన్నది సత్యసాయి బోధల సారం.
‘మనలో సేవాభావం ఉంటే, అది వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ఉన్నతమైన గుణసంపదను ఇస్తుంది’ అని భగవాన్ తన విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులకు బోధించేవారు.
దృఢమైన భక్తి, నియమ పాలన, కర్తవ్య శీలత, యుక్తాయుక్త విచక్షణ, సాధించి తీరాలనే సంకల్పం... ఈ అయిదూ విజయానికి చేరువ చేసే సోపానాలని బాబా బోధించేవారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, విలువలు పాటించే ప్రతి మనిషీ దైవ సమానుడేనన్నది సత్యసాయి సందేశం.
– డి.వి.ఆర్.


