మహిళల భాగస్వామ్యంతోనే వికసిత్‌ భారత్‌ | President Droupadi Murmu graced the centenary celebrations of St. Teresa College | Sakshi
Sakshi News home page

మహిళల భాగస్వామ్యంతోనే వికసిత్‌ భారత్‌

Oct 25 2025 6:20 AM | Updated on Oct 25 2025 6:20 AM

President Droupadi Murmu graced the centenary celebrations of St. Teresa College

సెయింట్‌ తెరిసా కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము
 

కొచ్చి: 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌(వికసిత్‌ భారత్‌) కల సాకారం అవ్వాలంటే మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. కేరళ రాష్ట్రం కొచ్చిలోని సెయింట్‌ తెరిసా కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో  శుక్రవారం ఆమె మాట్లాడారు. మహిళా నేతలు ముందుండి నడిపే సమాజం మరింత మానవీయంగా కాదు, సమర్థంగానూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో మహిళలకు సంబంధించిన కేటాయింపులు నాలుగున్నర రెట్లు పెరిగాయన్నారు. 2011–2014 మధ్య కాలంలో పరిశ్రమల్లో మహిళల ప్రాతినిథ్యం రెట్టింపయిందన్నారు. 

వివిధ సామాజిక ఆర్థిక రంగాలకు చెందిన మహిళలు నేడు దేశ పురోగతిలో భాగస్వాములుగా మారారన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళ ముందంజలో ఉందని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో కేరళకు చెందిన అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కరెనె, దాక్షాయణీ వేలాయుధన్‌ ఉండటం విశేషమన్నారు. వీరు సామాజిక న్యాయం, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కులపై జరిగిన సంప్రదింపులు చురుగ్గా పాలుపంచుకున్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు. 

కేరళకు చెందిన పలువురు మహిళలు వివిధ రంగాల్లో విశేష ప్రతిష్టను గడించారని అంటూ ఆమె..జస్టిస్‌ అన్నా చాందీ ఒక హైకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా పనిచేయగా, జస్టిస్‌ ఫాతిమా బీబీ 1989లో సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితులయ్యారన్నారు. సెయింట్‌ తెరిసా కాలేజీలో చదువుకున్న ఎందరో దేశ అభివృద్ధి, పురోగతిలో తమ వంతు భాగస్వాములుగా కీలకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. నిరుపేదలకు సేవ చేస్తూ నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్న కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి, విద్యార్థులు నిస్వార్థంగా సేవలందిస్తుండటం ఎంతో సంతోషకరమైన విషయమని ముర్ము తెలిపారు. సెయింట్‌ తెరిసా కళాశాల వంటి ఉన్నత విద్యాసంస్థల కృషితో భారత్‌ నాలెడ్జి సూపర్‌ పవర్‌గా మారనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement