పార్లమెంట్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం
హాజరైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన 69వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రేరణ స్థల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరై బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు పుష్పాంజలి ఘటించారు.
‘మహా పరినిర్వాణ్ దివస్ సందర్భంగా భారత రత్న, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్‌కు సవినయంగా నివాళులరి్పస్తున్నాను’అని ఉపరాష్ట్రపతి ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘డాక్టర్ అంబేడ్కర్ దార్శనికత కలిగిన నేత, న్యాయం, సమానత్వం కోసం ఆయన ఎంతో అంకితభావంతో పనిచేశారు’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
చైత్యభూమిపై పూలజల్లు
మహా పరినిర్వాణ్ దినాన్ని పురస్కరించుకుని ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ చైత్యభూమి వద్దకు శనివారం వేలాదిగా తరలివచ్చారు. అంబేడ్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎంసీ ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించింది. చైత్యభూమిపై హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపించారు. భారత రాజ్యాంగం ప్రతులను పంచిపెట్టారు. బీఎంసీ ఈ కార్యక్రమం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.


