పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలపై సమీక్ష
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు సర్కార్‌లో అందరూ ‘ప్రత్యేక’ విమానమే ఎక్కుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో విహరిస్తుండగా..తామేం తక్కువ కాదంటూ మంత్రులూ ఇప్పుడు ప్రజాధనంతో ‘ప్రత్యేక’ బాట పట్టారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో వేసిన కమిటీలో సవిత, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ ఉన్నారు.
ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష కోసం మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం పుట్టపర్తికి వచ్చి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
తిరుగు ప్రయాణంలోనూ ప్రత్యేక విమానాన్నే ఉపయోగించారు. కాగా, ప్రత్యేక విమాన ప్రయాణ అవకాశం రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాని, ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విహరిస్తుండటం గమనార్హం.


