
ఎన్ని దాడులు జరిగినా విద్వేషం ప్రదర్శించలేదు
సవాళ్లను తట్టుకొని స్థిరంగా నిలిచింది
భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ఆత్మ
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
సంఘ్ స్మారక నాణెంపై భరతమాత, స్వయం సేవకులు
స్వతంత్ర భారతదేశంలో కరెన్సీపై తొలిసారిగా భరతమాత చిత్రం
న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అద్వితీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన సంఘ్‌పై ఇప్పటిదాకా ఎన్నో దాడులు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఏనాడూ ఎవరిపైనా విద్వేషం ప్రదర్శించలేదని, అందరినీ అక్కున చేర్చుకుందని కొనియాడారు.
బుధవారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సంఘ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులం, జాతి అనే అడ్డుగోడలను తొలగించి, సమాజంలో ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా దేశంలో నలుమూలలకూ సంఘ్ విస్తరించిందని చెప్పారు.
సమీకృత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తోందని ఉద్ఘాటించారు. బ్రిటిషర్ల పాలనలో జరిగిన అకృత్యాలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు స్వయంసేవకులు ఆశ్రయం ఇచ్చారని, స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది సంఘ్ నాయకులు అరెస్టయ్యి జైలుశిక్ష అనుభవించారని చెప్పారు. దేశాన్ని ప్రేమించడమే ఆర్‌ఎస్‌ఎస్ విధానమని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
విశ్వాసం, గౌరవమే సంఘ్ బలం
‘‘ఆర్‌ఎస్‌ఎస్ ఆశయాలను అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. సంఘ్‌ను శాశ్వతంగా నిషేధించే ప్రయత్నాలు కూడా చేశారు. లెక్కలేనన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ సంఘ్ ఏనాడూ వెనక్కి తగ్గలేదు. మహా మర్రివృక్షంగా స్థిరంగా నిలిచింది. ఎవరినీ ద్వేషించలేదు. ఎందుకంటే మనమంతా ఈ సమాజంలో భాగమే. ఇక్కడ మంచితోపాటు చెడును కూడా స్వీకరించాల్సిందే. సంఘ్ అధినేత గురూజీ గోల్వాల్కర్‌పై తప్పుడు కేసు నమోదుచేసి, జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచి్చన తర్వాత ఆయన విజ్ఞత ప్రదర్శించారు.
జనాభా స్థితిగతుల్లో మార్పులు ఆందోళనకరం
ఆర్‌ఎస్‌ఎస్‌కు వందేళ్లు పూర్తవుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలన్న ఉద్దేశంతో సరిగ్గా వందేళ్ల క్రితం విజయ దశమి రోజున సంఘ్ స్థాపన జరిగింది. అప్పటి నుంచి దేశ ప్రగతికి కృషి చేస్తూనే ఉంది. దేశ భక్తి, ప్రజాసేవకు పర్యాయపదం ఆర్‌ఎస్‌ఎస్. ‘ఒకే భారత్, మహోన్నత భారత్’ అనే సిద్ధాంతాన్ని సంఘ్ విశ్వసిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ఆత్మ.
అది విచ్ఛిన్నమైతే దేశం బలహీనపడుతుంది. దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తుండడం ఆందోళనకరం. ఈ పరిణామం దేశ భద్రతకు, సామాజిక సామరస్యానికి ప్రమాదకరం. బాహ్య శక్తులు మన దేశంలోకి చొరబడి వేర్పాటువాద సిద్ధాంతాలను నూరిపోస్తున్నాయి. చొరబాటుదారుల నుంచి మన పౌరులను కాపాడేందుకు ‘డెమొగ్రఫిక్ మిషన్’ను ప్రకటించాం.
వాటి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి
1962లో యుద్ధం సమయంలో, 1971 నాటి సంక్షోభంలో, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో వారు విశేషమైన సేవలందించారు. బాధితులను ఆదుకున్నారు. సంఘ్ సేవలను మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రశంసించారు. వార్ధాలోని సంఘ్ క్యాంప్‌ను మహాత్మాగాంధీ సందర్శించారు. సంఘ్ సిద్ధాంతాలను కొనియాడారు. ప్రస్తుత సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సమాజం ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజలందరికీ ‘ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశాన వాటిక’ అని చెబుతున్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి ఉండాలని బోధిస్తున్నారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వివక్ష, విభజన, అసమ్మతి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
పోస్టల్ స్టాంప్, నాణెం ఆవిష్కరణ
సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. రూ.100 విలువ కలిగిన ఈ నాణెంపై ఒక వైపు భరతమాత చిత్రం, మరోవైపు జాతీయ చిహ్నం ఉంది. సింహంతోపాటు వరద ముద్రతో భరతమాత చిత్రం ఆకట్టుకుంటోంది. స్వయం సేవకులు ఆమెకు వందనం సమర్పిస్తున్నట్లుగా ఈ నాణెం ముద్రించారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే మొట్టమొదటిసారి అని ప్రధాని మోదీ చెప్పారు. ఇది చరిత్రాత్మకమని, మనకు గర్వకారణమని అన్నారు. నాణెంపై ఆర్‌ఎస్‌ఎస్ మోటో ‘రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ కూడా ముద్రించారు. ‘ఏదీ నాది కాదు.. అంతా దేశానికే అంకితం’ అని దీని అర్థం. ఇక పోస్టల్ స్టాంప్‌పై 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వయంసేవకులు పాల్గొన్న చిత్రం ముద్రించారు.
‘పంచ పరివర్తన్’ ఎజెండా
ప్రజల మద్దతుతోనే సంఘ్ వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే చెప్పారు. శతాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. దేశంలో నేడు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా మారిందని, దీని వెనుక ఎన్నో సవాళ్లు, కష్టాలు ఉన్నాయని తెలిపారు. సంఘ్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ్ నిస్వార్థ సేవలకు ఇది చక్కటి గుర్తింపు అని పేర్కొన్నారు.
మన దేశ ప్రగతి కోసం స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని ప్రజలను కోరారు. దేశం స్వయం సమృద్ధి సాధించడానికి అందరూ కృషి చేయాలన్నారు. శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంఘ్ నాయకత్వం ‘పంచ పరివర్తన్’ ఎజెండాను రూపొందించింది. భారతీయ విలువలు, సరైన కుటుంబ విలువలు, సామాజిక సామరస్యం, పర్యావరణహిత జీవనశైలితోపాటు పౌర విధులు సక్రమంగా నిర్వర్తించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నదే ఈ ఎజెండా లక్ష్యం.