source: BCCI X
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 29 ఏళ్ల సంచలన ఫాస్ట్ బౌలర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న ఆకిబ్ నబీ దార్ పేరు తెరపైకి వచ్చింది.
బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ పేరు దాదాపుగా ఖరారైనట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నబీకి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2025-26 రంజీ ట్రోఫీలో అతడు 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసుకుని టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడంలోనూ నబీ కీలక పాత్ర పోషించాడు.
ఓవరాల్‌గా అతడి ఫస్ట్‌క్లాస్ రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది.
* మ్యాచ్‌లు: 43
* వికెట్లు: 162
* బౌలింగ్ సగటు: 18.63
* 5 వికెట్ల ప్రదర్శనలు: 16
* 10 వికెట్ల ప్రదర్శనలు: 4
* అత్యుత్తమ బౌలింగ్: 7/24
శ్రీలంకలోనూ సత్తా నబీ
ఇటీవల భారత్-A జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లిన నబీ, శ్రీలంక-Aతో జరిగిన రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4/58తో ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నబీకి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టులో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో అతడి నిలకడైన ప్రదర్శన, శ్రీలంక పరిస్థితులపై ఇటీవల వచ్చిన అనుభవం అతడికి కలిసొచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, ఎడమ మోకాలి అసౌకర్యం నుంచి బుమ్రా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తొందరపెట్టకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. బుమ్రా ప్రత్యామ్నాయాన్ని సెలెక్టర్లు అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.


