PC: Turner Instagram
ఇంగ్లండ్ క్రికెటర్ జాన్ టర్నర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పాతికేళ్ల వయసులోనే ఆటకు రిటైర్మెంట్‌కు ప్రకటించాడు. సౌతాఫ్రికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జాన్ టర్నర్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు మకాం మార్చాడు.
ఈ క్రమంలో 2021లో హాంప్‌షైర్ జట్టులో చేరిన జాన్ టర్నర్ (John Turner).. దేశీ క్రికెట్‌లో సత్తా చాటాడు. ది హండ్రెడ్ కాంపిటిషన్‌లోనూ రాణించిన ఈ రైటార్మ్ పేస్ బౌలర్.. 2024లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.
గాయాల బెడద
ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన టర్నర్.. వన్డేల్లో రెండు, టీ20 ఫార్మాట్లో ఒక వికెట్ పడగొట్టాడు. చివరగా 2024లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తరచూ గాయాల బారిన పడుతున్నాడు. గతేడాది దేశీ క్రికెట్‌లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు.
అనంతరం వెన్నునొప్పి ఎక్కువ కావడంతో టర్నర్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనేది నా కల. హాంప్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించాలనే కోరికా పూర్తిగా తీరలేదు. అయితే, భారమైన హృదయంతో రిటైర్ అవ్వాలనే నేను నిర్ణయించుకున్నాను.

అందుకే ఈ కఠిన నిర్ణయం
నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం ఇదే. వెన్నునొప్పి వల్ల గతేడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాను. ఈ గాయం మానడం లేదు. క్రికెటర్‌గా, వ్యక్తిగా నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని జాన్ టర్నర్ పేర్కొన్నాడు.
కాగా టర్నర్ చిన్న వయసులోనే రిటైర్ కావడం పట్ల హాంప్‌షైర్ క్రికెట్ డైరెక్టర్ గిల్స్ వైట్ విచారం వ్యక్తం చేశాడు. ప్రతిభావంతుడైన ఆటగాడి సేవలు తాము కోల్పోయామని.. ఏదేమైనా అతడి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన టర్నర్ 25 వికెట్లు కూల్చాడు.
ఆ రంగంలో కెరీర్?
ఇక లిస్ట్-ఎ క్రికెట్‌లో 37 వికెట్లు పడగొట్టిన టర్నర్.. ది హండ్రెడ్-2024 సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. కాగా జాన్ టర్నర్ ఎకానమిక్స్, ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ చేశాడు. ఆటకు వీడ్కోలు చెప్పిన అతడు ఫైనాన్స్ రంగలో కెరీర్ నిర్మించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: శ్రీలంకతో మ్యాచ్.. గిల్ బదులు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్


