‘మిస్ ఇండియా యూనివర్స్ ఐర్లాండ్’ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా వైరా వాసి
మూడో రన్నరప్‌గా వరంగల్ యువతి
వైరా: ఐర్లాండ్‌లో ఈనెల 8వ తేదీన నిర్వహించిన మిస్ ఇండియా యూనివర్స్ ఐర్లాండ్ పోటీల్లో ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఫస్ట్ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2022లో అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన ఆమె అక్కడే కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యాన ఐర్లాండ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన భారత్ నుంచి వెళ్లి ఐర్లాండ్‌లో ఉంటున్న యువతులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 18 మంది పాల్గొన్నారు.
ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగిన పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిఖిత నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో కేరళకు చెందిన అన్‌మోల్, వరంగల్‌కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఈ సందర్భంగా నిఖిత ‘సాక్షి’తో మాట్లాడుతూ స్టేజీ ఫెర్పార్మెన్స్‌ను పరిశీలించడమే కాక న్యాయనిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారని తెలిపారు. అపజయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తావన్న ప్రశ్నకు మనోధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నం చేస్తానని వెల్లడించింది. కాగా, నిఖిత తల్లి సునీత వైరా 12వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలవగా ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఐర్లాండ్ అందాల పోటీల్లో ఆమె నెగ్గడంపై తల్లిదండ్రులు, వైరా వాసులు అభినందించారు.


