హమీర్‌పూర్: హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వృద్ధుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వ్యక్తిగత ఆస్తిని సమాజ ప్రయోజనాలకు అంకితం చేస్తూ ఆయన చూపిన ఉదారత స్ఫూర్తిగా నిలిచింది. నాదౌన్ జిల్లాలో జోలాస్‌పాడ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యుడు రాజేంద్ర కన్వర్ (77) తన పేరిట, తన భార్య పేరిట ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. 2021లో డాక్టర్ కన్వర్ తన చరాస్తులు, స్థిరాస్తులు అన్నింటినీ ప్రభుత్వానికి దానం చేశారు. ఇప్పుడు జీవించి ఉండగానే, స్వచ్ఛందంగా, పూర్తి స్పృహతో దానపత్రం రూపొందించి తన ఆస్తిని ప్రభుత్వానికి బదిలీ చేశారు.
దానపత్రం అనంతరం సంబంధిత భూమి బదిలీ నమోదు రాష్ట్ర ప్రభుత్వం పేరిట, అంటే హమీర్‌పూర్ డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ వైద్య కళాశాల పేరిట జరిగింది. అంతేకాదు, తన మరణానంతరం శిక్షణ పొందుతున్న వైద్యుల అధ్యయనం కోసం తన శరీరాన్ని దానం చేయాలని కూడా కన్వర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి వైద్య కళాశాల శరీర నిర్మాణ శాస్త్ర విభాగానికి లిఖితపూర్వకంగా సమ్మతి ఇచ్చారు. గుర్తింపు కార్డు కూడా పొందారు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
డాక్టర్ రాజేంద్ర కన్వర్ దీనిపై మాట్లాడుతూ.. తాను, తన భార్య తమ ఆస్తిని సమాజ ప్రయోజనాల కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమకు సంతానం లేదని తెలిపారు. దానం చేసిన ఆస్తిలో 2 అంతస్తుల బంగ్లా, సుమారు 5 కనాల్ భూమి, వందల ఎకరాల భూమి, కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బ్యాంకులో జమ చేసిన డబ్బు సహా ఇతర ఆస్తులు ఉన్నాయి.
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ మొత్తం ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. ఈ ఆస్తిని అవసరమైన ప్రజల ఆరోగ్య సౌకర్యాల కోసం వినియోగించాలని కన్వర్ అన్నారు. భవిష్యత్తులో తన భార్య జ్ఞాపకార్థం సంస్థకు “కృష్ణ రాజేంద్ర” అనే పేరు పెట్టాలని కూడా చెప్పారు.
భార్య ప్రిన్సిపల్ హోదా నుంచి పదవీ విరమణ
డాక్టర్ కన్వర్ భార్య కృష్ణా కన్వర్ విద్యాశాఖలో 32 సంవత్సరాలు సేవలందించారు. 2011లో ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. 2020 డిసెంబర్ 6న ఆమె మరణించారు. అంతకు ముందే ఈ దంపతులు తమ ఆస్తిని సమాజ ప్రయోజనాల కోసం దానం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ రాజేంద్ర కన్వర్ 1977 జనవరి 3న మెడికల్ ఆఫీసర్‌గా ఆరోగ్య శాఖలో చేరారు. 33 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం అనంతరం 2010లో పదవీ విరమణ చేశారు. 77 ఏళ్ల వయసులో కూడా తన ఇంటి నుంచే తక్కువ ఫీజుతో రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కన్వర్ దంపతులు తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన వర్గాలు కూడా వారికి కృతజ్ఞతలు తెలిపాయి. డాక్టర్ కన్వర్ లాంటి వ్యక్తులు చాలా అరుదు. తన ఆస్తిని సమాజ వినియోగానికి ఇవ్వాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకం అని నాదౌన్ ఎస్‌డీఎం నిశాంత్ శర్మ వ్యాఖ్యానించారు.


