లండన్ : దక్షిణ ఇంగ్లాండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి మూడు భోగీలు బోల్తా పడ్డాయి. లండన్‌లోని విక్టోరియా స్టేషన్ నుండి ఈస్ట్‌బోర్న్ వెళ్తున్న సదరన్ రైలు పర్యాటక ప్రాంతమైన లూయిస్ సమీపంలో ఈ ప్రమాదానికి గురైంది.
రైలు వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుదుపులకు గురైందని, తాము ప్రయాణిస్తున్న బోగీ పైకి లేచి ఆకస్మికంగా బ్రేకులు పడ్డాయని ప్రయాణికుడు రాబ్ బ్రాడ్లీ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, లగేజీతోపాటు అందరూ ముందుకు పడిపోయారని, రైలు కొంతదూరం అలాగే జారిన తర్వాత ఆగిపోయిందని వివరించారు.
ఆ తర్వాత తాము వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక ఉన్న బోగీలు పూర్తిగా తెరుచుకుని, దట్టమైన పొగ, ధూళి కమ్ముకున్నాయని, ఒక బోగీ పక్కకు తిరిగి ఎంబ్యాంక్మెంట్ నుంచి కింది పొలంలోకి పడిపోయిందని ఆయన చెప్పారు.
ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్, ఆంబులెన్స్‌లతో పాటు మూడు హెలికాప్టర్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై రవాణా మంత్రి హీడీ అలెగ్జాండర్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


