బాంబర్‌ బీభత్సం.. షాకింగ్‌ విజువల్స్‌ వైరల్‌! | Bombing at Peace Rally Viral: Pakistan's Terror Challenge Returns | Sakshi
Sakshi News home page

బాంబర్‌ బీభత్సం.. షాకింగ్‌ విజువల్స్‌ వైరల్‌!

Aug 3 2026 10:31 AM | Updated on Aug 3 2026 10:42 AM

Bombing at Peace Rally Viral: Pakistan's Terror Challenge Returns

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌ మరోసారి ఉగ్రదాడితో వణికిపోయింది. శాంతి కోసం నిర్వహించిన ఓ నిరసన ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్‌ దాడికి పాల్పడ్డాడు. స్వాత్‌ జిల్లాలోని కబాల్‌ పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడి దృశ్యాలు.. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. "మిలిటెన్సీని అంతం చేయాలి.. ప్రజలకు భద్రత కల్పించాలి" అంటూ నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్దే పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులే టార్గెట్‌.. శాంతి ర్యాలీపై పంజా
స్వాత్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ప్రకారం ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బంది కూడా మృతి చెందారు. దాడి జరిగిన ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు శబ్దం వినిపించగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు స్థానికులు సహకరించారు.

ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలో చురుకుగా ఉన్న తెహ్రీక్‌-ఏ-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (TTP)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఇక్కడే ఎందుకు దాడులు?
పాకిస్థాన్‌లో ఉగ్రవాద సమస్యకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ఒకటి. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కారణంగా ఈ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద గ్రూపులకు స్థావరంగా మారింది. గతంలో ఈ ప్రాంతం పాకిస్థాన్‌ తాలిబాన్‌ వంటి మిలిటెంట్‌ గ్రూపుల ప్రభావంలో ఉండేది. పాకిస్థాన్‌ సైన్యం చేపట్టిన ఆపరేషన్లతో కొంతకాలం దాడులు తగ్గినా.. ఇటీవలి సంవత్సరాల్లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయి.

TTP మళ్లీ పుంజుకుంటోందా?
తెహ్రీక్‌-ఏ-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (TTP) లక్ష్యం పాకిస్థాన్‌లో తమకు అనుకూలమైన కఠిన ఇస్లామిక్‌ పాలన ఏర్పాటు చేయడం. ఈ సంస్థ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లోని కొన్ని మిలిటెంట్‌ గ్రూపులకు ధైర్యం పెరిగిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘన్‌ తాలిబాన్‌ ప్రభుత్వం తమ భూభాగం నుంచి పాకిస్థాన్‌పై దాడులు జరగడం లేదని చెబుతోంది.

శాంతి కోరుతున్న ప్రజలే ఎందుకు బలవుతున్నారు?
ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలోని సాధారణ ప్రజలు ఏళ్లుగా ఉగ్రవాదం, సైనిక చర్యల మధ్య నలిగిపోతున్నారు. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా పేరున్న స్వాత్‌ లోయ కూడా ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు అక్కడి ప్రజలు మళ్లీ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుతున్నారు. అయితే శాంతి కోసం గొంతెత్తుతున్న వారినే లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల వ్యూహంలో భాగమని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో భయాన్ని పెంచడం, ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీయడం, భద్రతా వ్యవస్థను సవాలు చేయడమే ఇలాంటి దాడుల ప్రధాన ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్‌?

పాక్‌కు పెరుగుతున్న భద్రతా సవాల్‌
ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. కేవలం సైనిక చర్యలతోనే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం సాధ్యం కాదని.. స్థానిక ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సరిహద్దు నియంత్రణ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

శాంతి కోసం జరిగిన ర్యాలీపై జరిగిన ఈ దాడి.. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలో ఉగ్రవాద సమస్య ఇంకా ఎంత తీవ్రంగా ఉందో మరోసారి బయటపెట్టింది. ప్రజలు భయంతో జీవించే పరిస్థితికి ముగింపు పలకడం పాకిస్థాన్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement