ముగ్గురు పాకిస్తానీలు, ఒక ఇండోనేషియన్, ఇద్దరు సహాయకులు మృతి
సనా(యెమెన్): ఎర్ర సముద్రం, బాబ్ ఎల్–మండేబ్ జలసంధిలో సరుకు రవాణా నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా టాంజానియా జెండాతో ప్రయాణిస్తున్న ‘తిహామా’సరుకు రవాణా నౌకపై హౌతీలు క్షిపణి దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు నౌక సిబ్బంది, మరో ఇద్దరు సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పాకిస్తానీలు, ఒక ఇండోనేషియన్ ఉన్నారు.
పది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురు సిబ్బంది, ఇద్దరు కోస్ట్ గార్డ్ సిబ్బంది, జాతీయ ప్రతిఘటన దళాలకు చెందిన ఒక సభ్యుడు ఉన్నారు. దాడి జరిగిన తర్వాత సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారని, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాక హౌతీలు రెండోసారి దాడి చేయడంతో, యెమెన్‌కు చెందిన హౌతీ వ్యతిరేక జాతీయ ప్రతిఘటన దళాలకు చెందిన ఇద్దరు సహాయక సిబ్బంది కూడా మరణించారని కోస్ట్ గార్డ్ తెలిపింది.
ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి నౌకలపై హౌతీల దాడిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. యెమెన్ తీరానికి సమీపంలో భారత సరుకు రవాణా నౌక ‘ఎంఎస్‌వి ఫైజ్ నూరే ఓలియా’పైనా ఆగస్ట్ 5న దాడి జరిగింది. ఈ ప్రమాదంలో నౌక మునిగిపోయింది. నౌకలోని 13 మంది భారతీయులతో సహా 14 మంది సిబ్బందిని యెమెన్ తీర రక్షక దళం రక్షించింది.
బాబ్ ఎల్–మండేబ్, ఎర్ర సముద్రం గుండా
ఇటీవలికాలంలో నౌకాయానం తీవ్రంగా క్షీణించింది. 2023లో హౌతీలు వాణిజ్య నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించినప్పటి నుంచి రవాణా 50% పడిపోయింది. కాగా, తాజా హౌతీ దిగ్బంధనానికి ముందు రోజుకు సుమారు 50 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించగా, గత వారం ఈ సంఖ్య సగటున 32కి పడిపోయింది. హారూŠమ్‌జ్ జలసంధి గుండా రవాణా కూడా తీవ్రంగా పడిపోయింది. యుద్ధానికి ముందు రోజుకు దాదాపు 130 నుంచి 140 నౌకలు ప్రయాణించగా, గత 10 రోజులుగా సగటున రోజుకు సుమారు 11 నౌకలు మాత్రమే దాటుతున్నాయి. ఇక, సోమవారం కేవలం ఆరు నౌకలు మాత్రమే ప్రయాణించాయి.


