వైఎస్సార్‌సీపీ గర్జనతో టీడీపీలో వణుకు | YSRCP Protests Over AP DSC Allegations: High Tension as TDP-YSRCP Clash | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గర్జనతో టీడీపీలో వణుకు

Aug 6 2026 12:38 PM | Updated on Aug 6 2026 12:44 PM

DSC Row: YSRCPs Roar Sends Shockwaves Through TDP

సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కూటమి ప్రభుత్వం బెదిరిపోయింది. ఈ క్రమంలోనే.. పోలీసులను ప్రయోగించింది. అయినా పోరాటం ఆగకపోవడంతో నేరుగా టీడీపీ గుండాలను రంగంలోకి దించింది. 

డీఎస్సీ అవకతకవలపై పోరాటాలను వైఎస్సార్‌సీపీ ఉదృతం చేసింది. ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ.. నియోజకవర్గాల వారీగా రిలే దీక్షలకు పిలుపునిచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలతో కలిసి పార్టీ యువజన విభాగం ఆధ్వరంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు ఈ దీక్షలు మొదలయ్యాయి. అయితే లోకేశ్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీక్షకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నాల చేశారు. అంతటితో ఆగకుండా.. టెంట్‌లను సైతం పీకేసి వెళ్లిపోయారు. అయితే.. 

పలు చోట్ల దీక్షలు సజావుగా సాగడంతో కూటమి ప్రభుత్వం భరించలేకపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ గూండాలను దీక్షా శిబిరాలపైకి ఉసిగొల్పింది. దీంతో రాష్ట్రంలో పలు దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇందుకు విజయవాడలో జరిగిన దౌర్జన్యకాండే ఉదాహరణగా నిలిచింది. 

విజయవాడలోని దీక్షా శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నేరుగా దాడి చేశారు. కొందరు వ్యక్తులు టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. అక్కడ ఉన్న మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేశారు. మహిళా జర్నలిస్టులను, పోలీసులను కూడా వదలకుండా దాడులు చేశారు. మరో అడుగు ముందుకు వేసి.. ఓ అనుచరుడు నీచంగా ప్రవర్తించాడు. దీక్షా శిబిరం పై నుంచి అక్కడున్నవాళ్లపై మూత్రం పోశాడు. 

ఏపీలో ఇవాళ చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆ సమయాల్లో.. పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు.  ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న నిరసనలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ప్రేక్షక పాత్ర వహించారు. దాడులను అడ్డుకోవడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. అయితే.. ఏం జరిగినా తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్‌సీపీ అంటోంది. అరెస్టులు.. దాడులు తమని ఆపవని అంటోంది. డీఎస్సీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటోంది. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని.. చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం ఆగదని కుండబద్దలు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement