సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీ పరీక్షలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ముత్యాలపాడు వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యానికి దిగారు. అనంతరం, పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులు దౌర్జన్యంగా, అత్యంత నీచంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ నేతల దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. దీక్షా శిబిరంపైకి ఎక్కి.. టీడీపీ కార్యకర్త ఒకరు టాయిలెట్ చేశారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు గుడ్లు విసిరారు. దీంతో, టీడీపీ కార్యకర్తులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్న సమయంలోనే ఇదంగా జరగడం గమనార్హం. టీడీపీ నేతల దాడి కారణంగా ఓ మహిళా వైఎస్సార్‌సీపీ కార్యకర్త స్పృహ తప్పిపోయి కిందపడిపోయినట్టు సమాచారం. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరిగాయని పార్టీ నేతలు ఆరోపించారు.
అనంతరం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గూండాయింజ చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం మన దురదృష్టం. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యం చేశారు అని అన్నారు. దీక్షా శిబిరంలో ఉన్న మహిళలపై కూడా దాడులు చేయడం గమనార్హం. ఈ ఘర్షణల తర్వాత.. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. టీడీపీ శ్రేణులు ఘర్షణలకు కారణమైనప్పటికీ వారిని మాత్రం పోలీసులు పట్టించుకోలేదు.


