మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా | North Korea fired a ballistic missile toward the East Sea | Sakshi
Sakshi News home page

మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

Aug 13 2026 6:10 AM | Updated on Aug 13 2026 6:10 AM

North Korea fired a ballistic missile toward the East Sea

వారం రోజుల్లో రెండో బాలిస్టిక్‌ క్షిపణి 

దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త విన్యాసాలకు నిరసన

సియోల్‌: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించి కలకలం రేపింది. తూర్పు తీరంలోని వోన్సన్‌ ప్రాంతం నుంచి జపాన్‌ సముద్రం వైపు బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా ఆయుధ సంసిద్ధత కోసం ఆగస్టు 17న వార్షిక ఉల్చి ఫ్రీడమ్‌ షీల్డ్‌ విన్యాసాలను ప్రారంభిస్తామని దక్షిణ కొరియా, అమెరికా ప్రకటించిన రెండు రోజులకే ఈ ప్రయోగం జరిగింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఆగస్టు 6న ఒక స్వల్ప–శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. 

అయితే తాజా ప్రయోగ వార్తను మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. ఈ క్షిపణి 700 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించకుండా ఉత్తర కొరియాను పలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు నిషేధించినప్పటికీ, ప్యాంగ్యాంగ్‌ తన క్షిపణి, అణు కార్యక్రమాలను విస్తరిస్తూనే ఉందని, ఉత్తర కొరియా చేసే ఎలాంటి రెచ్చగొట్టే చర్యలనైనా అమెరికాతో సమన్వయంతో తిప్పికొట్టడానికి దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలను ఆపాలని దక్షిణ కొరియా అధ్యక్ష జాతీయ భద్రతా మండలి కూడా ఉత్తర కొరియాను కోరింది. 

2019లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిపిన అత్యంత కీలకమైన దౌత్యం విఫలమైనప్పటి నుంచి ఆ దేశం బాలిస్టిక్, ఇతర ఆయుధాల పరీక్షలను పెంచింది. ఇటీవలి కాలంలో కిమ్‌ ఉత్తర కొరియా దౌత్య సంబంధాలను విస్తృతం చేశారు. రష్యాతో, చైనాతో సంబంధాలను పటిష్టం చేసుకునే చర్యలను పెంచారు. ఉల్చి ఫ్రీడమ్‌ షీల్డ్‌ సహా, ఇతర ప్రధాన సైనిక విన్యాసాలు రక్షణాత్మకమైనవని దక్షిణ కొరియా, అమెరికా పదేపదే చెబుతున్నాయి. అయితే గతేడాది విన్యాసాలు మునుపటి కంటే మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొన్నారు. అందుకే తాము ముందస్తు, తీవ్రమైన ప్రతిచర్యలు తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ఆ మేరకే తరచూ ఆయుధ పరీక్షలతో ప్రతిస్పందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement