వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. | Nandi Village Bhoganandiswara Arunachaleswara Temples History | Sakshi
Sakshi News home page

వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..

Aug 13 2026 8:49 AM | Updated on Aug 13 2026 9:00 AM

Nandi Village Bhoganandiswara Arunachaleswara Temples History

సన్నిధి

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లా బెంగళూరుకు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ నంది కొండల పాదభాగాన ఉన్న నంది గ్రామం చరిత్ర కళా వైభవం ప్రకృతి సౌందర్యం మూడింటినీ ఒకే చోట కలిపిన అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోనే కర్ణాటకలో అత్యంత ప్రాచీనమైన శైవ ఆలయ సముదాయాలలో ఒకటైన భోగనందీశ్వర, అరుణాచలేశ్వర జంట దేవాలయాలు ఉన్నాయి.

నోలంబవాది ద్రావిడ శిల్పశైలికి తొలి నిదర్శనాలలో ఒకటిగా గుర్తింపు పొం​దిన ఈ ఆలయ సముదాయం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్రను తనలో దాచుకుంది. నంది కొండల నుండి దిగివచ్చే సహజ జలవాహినులు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడం వల్ల ప్రాచీన కాలం నుంచే ఇది పవిత్ర తీర్థక్షేత్రంగా అభివృద్ధి చెందింది.

ఈ ఆలయ నిర్మాణం తొమ్మిదవ శతాబ్దం మొదట్లో ప్రారంభమై దాదాపు వంద సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఈ ఆలయ సముదాయం నిర్మాణంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. దక్షిణాన ఉన్న అరుణాచలేశ్వర ఆలయం పరమశివుని బాల్య దశను సూచిస్తే ఉత్తరాన ఉన్న భోగనందీశ్వర ఆలయం యవ్వన దశను సూచిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న చిన్న ఉమా మహేశ్వర ఆలయం శివపార్వతుల దాంపత్య జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మూడు ఆలయాలను వరుసగా దర్శించడం ద్వారా శివుని జీవనయాత్రను ప్రతీకాత్మకంగా అనుభవించినట్లవుతుందని స్థానిక విశ్వాసం.

రెండు ప్రధాన ఆలయాల గర్భగృహాలు ఎతై ్తన వేదికలపై నిర్మించబడ్డాయి. ప్రతి గర్భగృహంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఈ రెండు ఆలయాలకు విడివిడిగా నంది మండపాలు ఉండటం అత్యంత అరుదైన విశేషం. సాధారణంగా శివాలయాలలో ఒకే నంది విగ్రహం ప్రధాన గర్భగృహానికి ఎదురుగా ఉంటుంది. అయితే ఇక్కడ రెండు నంది విగ్రహాలు తమ తమ గర్భగృహాలకు అనుగుణంగా సరిగ్గా అమర్చబడి ఉండటం ఆలయ నిర్మాణ శైలిలో అసాధారణ లక్షణంగా భావించబడుతుంది.

ఈ ఆలయ సముదాయంలోని సభామండపం శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి స్తంభంపైనా దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు నర్తకులు యాళులు ఏనుగులు గుర్రాలు హంసలు మకరాలు పూలతీగలు పురాణ దృశ్యాలు అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. ఒక స్తంభంపై పదితలలు పది జతల చేతులతో కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్న రావణాసురుని శిల్పం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. జుట్టు ముడులు ఆభరణాలు గాజులు వేళ్లగోళ్లు వస్త్ర మడతలు వరకు ఎంతో సూక్ష్మంగా చెక్కిన తీరు అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. మండపంలోని కొన్ని స్తంభాలపై తమిళ శాసనాలు చెక్కబడి ఉన్నాయి.

ఆలయ గోడలు, గవాక్షాలు, ద్వారబంధాలు, పైకప్పు అంచులు అన్నిచోట్లా శిల్పకళ నిండి ఉంటుంది. ప్రధానంగా శైవ క్షేత్రమైనా నరసింహుడు లక్ష్మీదేవి దుర్గాదేవి సూర్యుడు అగ్నిదేవుడు గణపతి సుబ్రహ్మణ్యుడు సప్తమాతృకలు, భైరవుడు చండేశ్వరుడు వంటి అనేక దేవతా రూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. శైవ వైష్ణవ శాక్త సంప్రదాయాల సమన్వయాన్ని ఈ శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాలు గంభీరమైన భంగిమలో నిలిచి సందర్శకులను ఆకట్టుకుంటాయి.
– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌

నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement