సందర్భం
పెళ్లి కోసమై వలలో పడెనే పాపం పసివాడు...అని పాడుకోవచ్చునేమో! ఇది పెళ్లిళ్ల పేరయ్యల కాలం కాదు. వివాహాలకు సంబంధించి చాలా మంది మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లపై ఆధారపడుతున్న కాలం. దీన్ని ఆసరాగా చేసుకొని మాట్రిమోనియల్ స్కామ్స్ జరుగుతున్నాయి. జీవిత భాగస్వామి కోసం వెదుక్కునే క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఏఐ సాంకేతికత వల్ల మాట్రిమోనియల్ మోసాలను కనిపెట్టడం కష్టంగా మారింది. రొమాన్స్ స్కామ్ ప్రొఫైల్స్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది! సైబర్ మోసగాళ్లు మాట్రిమోనియల్ సైట్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి...
ఒక మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ నుంచి ముప్పై అయిదేళ్ల సాప్ట్‌వేర్ ఇంజినీర్ నీరజ్‌కు ఆసక్తికరమైన రిక్వెస్ట్ వచ్చింది. తనను తాను క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్ అని పరిచయం చేసుకున్న ఆమె తన పేరు రీతిక అని చెప్పింది. కొన్ని వారాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తన కుటుంబం, తాను చేసే ఉద్యోగం, మ్యారేజ్ ప్లాన్స్ గురించి వివరంగా చెప్పింది.
ఈ క్రమంలోనే ఫారెక్స్ ట్రేడింగ్ (ఫారిన్ ఎక్సే ్చంజ్ ట్రేడింగ్)లో ‘సేఫ్ రిటర్న్స్’ గురించి ప్రస్తావించింది. ‘మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను సహాయం చేస్తాను’ అని కూడా చెప్పింది. ఆమె చెప్పిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అది చట్టబద్ధమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అనే నమ్మకం వచ్చింది. డ్యాష్‌బోర్డ్‌లో ప్రాఫిట్స్ కనిపించాయి. ‘ఫరవాలేదు. ఇన్వెస్ట్ చేయవచ్చు’ అనే నమ్మకాన్ని కలిగించాయి.
ఆ తరువాత ఏమైందంటే...
ఆ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్ చేశాడు నీరజ్. కొంత లాభాలు వచ్చిన తర్వాత తన డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ట్రేడింగ్(?) ప్లాట్‌ఫామ్ స్పందించడం మానేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రీతిక అనే పేరుతో ఎవరూ లేరని, ఆ ఫొటోగ్రాఫ్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సృష్టించారని, వీడియో కాల్స్‌ను ఏఐ టూల్స్‌తో మానిప్యులేట్ చేశారని, గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేశారనే విషయం దర్యాప్తులో బయటపడింది. డజన్‌ల కొద్దీ నకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్‌ను నిర్వహిస్తున్న ఒక నెట్‌వర్క్ స్కామ్ ఇది అని తేలింది.
నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు
నకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్, నకిలీ ఫారెక్స్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం ద్వారా సూరత్‌కు చెందిన కొందరిని మోసం చేసిన సైబర్ మోసాల ముఠా సభ్యులను ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు!
మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫామ్‌లు సైబర్ నేరగాళ్లకు ఆకర్షణీయమైన కేంద్రాలుగా మారాయి. మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లకు నమ్మకం అనేది ప్రధానం. ఆ నమ్మకాన్నే ఆధారంగా చేసుకొని మోసగాళ్లు చేతివాటం చూపుతున్నారు. తమ జీవితభాగస్వామి గురించి వెదుకుతున్నప్పుడు కుటుంబ నేపథ్యం నుంచి వృత్తి వివరాల వరకు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కడం వల్ల దుర్వినియోగం అవుతోంది.
నకిలీ పేర్లు, దొంగిలించిన ఫొటోల స్థాయిని దాటి రొమాన్స్ స్కామ్స్ చాలా ముందుకువెళ్లాయి. సంభాషణలు నమ్మశక్యంగా, సహజంగా ఉండడానికి ఇమేజ్ ఎడిటింగ్, వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. జనరేటివ్ ఏఐ ద్వారా రొమాన్స్ స్కామ్స్‌ని కన్విన్సింగ్‌గా చేయడం సులువైంది. తక్కువ టైమ్‌లోనే వీలైనంత ఎక్కువ మందిని మోసం చేయవచ్చు.
ఆ తరువాతే...
‘గతంతో పోల్చితే మోసాలను గుర్తించడం కష్టమవుతుంది. ప్లాట్‌ఫామ్‌లు తమ ధ్రువీకరణ ప్రక్రియను బలోపేతం చేయాలి. తద్వారా మోసాలు జరగకుండా చేయవచ్చు’ అంటున్నారు నిపుణులు. గతంలో మాదిరిగా ‘వెంటనే మోసం చేయాలి–డబ్బులు దండుకోవాలి’ అని తొందరపడడం లేదు సైబర్ నేరగాళ్లు.
‘తగిన సమయం వెచ్చించాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆ తరువాతే డబ్బులు దండుకోవాలి’ అనే పాలసీని అనుసరిస్తున్నారు.
మోసపోతే...
→ చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్‌లు, చెల్లింపు రసీదులు, మొబైల్ నంబర్లు, ఇ–మెయిల్ ఐడీలు, ప్రొఫైల్ లింక్‌లతో సహా అన్ని ఆధారాలను భద్రపరచండి.
→ వీలైనంత త్వరగా సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
→ నకిలీ ప్రొఫైల్ గురించి మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌కు తెలియజేయండి. తద్వారా ఇతరులు మోసాల బారిన పడకుండా చూడవచ్చు.
ఇలా అయితే అనుమానించాల్సిందే!
→ నకిలీ లేదా ఏఐ రూపొందించిన ప్రొఫైల్‌ను గుర్తించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు.
→ వ్యక్తిగత వివరాలు తక్కువగా ఉన్న ప్రొఫైల్, అసాధారణంగా, అతి వివరాలు ఉన్న ప్రొఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
→ కొత్తగా పరిచయం అయిన వ్యక్తి సాధారణ ప్రశ్నలకు కూడా అస్పష్టమైన, పొంతన లేని సమాధానాలు ఇస్తే అనుమానించాలి.
→ లైవ్ వీడియో కాల్స్‌ను నిరాకరిస్తే, వ్యక్తిగతంగా కలవడానికి ‘నో’ చెబితే అనుమానించాల్సిందే.
→ పరిచయం అయిన కొద్దికాలంలోనే డబ్బు, బహుమతులు, వ్యక్తిగత సమాచారం అడిగినా, ‘ఇన్వెస్ట్ చేయండి’ అని సలహా ఇచ్చినా...వీటిని ప్రమాద సంకేతాలుగా పరిగణించాలి
→ కస్టమ్స్ చార్జీలు, వీసా సమస్యలు, వైద్య ఖర్చులు... మొదలైన వాటి పేర్లతో డబ్బు దండుకోవడానికి ప్రయత్నిస్తుంటారు
→ ఆన్‌లైన్ సంభాషణల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు.


