1931 డిసెంబర్ 14. కమిల్లా జిల్లా కోర్టు. మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ ఎదుట చేతిలో రివాల్వర్‌తో14 ఏళ్ల స్కూల్ అమ్మాయి. తర్వాతి 10 సెకన్లలో పేలిన 5 గుళ్లు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించాయి. ఆ అమ్మాయి పేరు సునీతి చౌదరి. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో యంగెస్ట్ విప్లవకారిణి. చరిత్రలో మూలకు నెట్టివేయబడ్డ అగ్ని జ్వాల. ఆమె సాహసభరిత గాథ ఇది.
భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఉరితీతతో దేశమంతా రగిలిపోతున్న కాలమది. ‘ఇంకా ఎంతకాలం ఈ బానిస సంకెళ్లు?’ అని ప్రతి యువకుడు ప్రశ్నిస్తున్న రోజులవి. బెంగాల్‌లోని కమిల్లా అనే చిన్న పట్టణంలో ఒక స్కూల్ అమ్మాయి ఈ ప్రశ్నకు తుపాకీతో జవాబు ఇచ్చింది. వయసు 14. పేరు సునీతి చౌదరి. పాఠాలు చదవాల్సిన వయసులో చరిత్ర రాసింది.
బాల్యమే విప్లవ పాఠశాల
సునీతి 1917 మే 22న కమిల్లా (నేటి బంగ్లాదేశ్)లో జన్మించింది. తండ్రి ఉమాచరణ్ చౌదరి. ఆమె అన్నయ్యలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ ఉండటం వల్ల ఇంట్లో రోజూ దేశభక్తి, బ్రిటిష్ దౌర్జన్యాల గురించి చర్చ జరిగేది. బెంగాల్ అప్పటికే విప్లవ సంఘాలకు కేంద్రం. స్కూల్లో చదువుతూనే సునీతి రహస్య విప్లవ సభలకు హాజరయ్యేది. ఆమె ప్రాణస్నేహితురాలు 15 ఏళ్ల శాంతి ఘోష్ కూడా సునీతికి తోడైంది. ఇద్దరూ కలిసి ‘మనం ఏదో చేయాలి’ అని ప్రతిజ్ఞ చేశారు. శత్రువును శత్రువు భాషలోనే ఎదుర్కోవాలని భావించిన సునీతి ‘యుగాంతర్’ అనే విప్లవ సంస్థలో చేరింది. అక్కడ కర్రసాము, కత్తిసాముతోపాటు తుపాకీ కాల్చడంలో అసాధారణ శిక్షణ పొందింది. వయసు చిన్నదైనా, ఆమె గురి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు.
రెచ్చగొట్టిన కలెక్టర్
1931 సెప్టెంబర్‌లో కమిల్లా జిల్లా మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ స్వయంగా సునీతి, శాంతి చదువుతున్న గవర్నమెంట్ హైస్కూల్‌కి వచ్చాడు. అమ్మాయిలను లైన్ లో నిలబెట్టి ‘గాడ్ సేవ్ ది కింగ్’ అని నినదించమన్నాడు. ఒప్పుకోని పిల్లలను చెంపలు వాయించాడు. అతని మీద అప్పటికే అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. ‘పిల్లల మీద చేయి వేసేవాడు మనిషే కాదు’ అని సునీతి, శాంతి డిసైడ్ అయ్యారు. టార్గెట్ ఫిక్స్ అయ్యింది.
గర్జించిన గుళ్లు
1931 డిసెంబర్ 14. ఉదయం 10 గంటలు. సునీతి, శాంతి ఇద్దరూ స్కూల్ యూనిఫాం, చేతిలో పుస్తకాలు పట్టుకుని కోర్టుకు వచ్చారు. కలెక్టర్ స్టీవెన్స్ కు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినట్టు నటించారు. కలెక్టర్ టేబుల్ దగ్గరికి వెళ్లగానే ఒక్కసారిగా పుస్తకాల్లో దాచిన రివాల్వర్లు బయటికి తీసి ఎడాపెడా 5 గుళ్లు పేల్చారు. స్టీవెన్స్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అందరూ షాక్‌లో ఉండగా ఇద్దరూ పారిపోలేదు. నిలబడి ‘జై హింద్! భారత్ మాతా కీ జై!’ అని నినదించారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.
దేశం కోసం చేశాం
కోర్టులో జడ్జి అడిగాడు– ‘ఎందుకు చేశారు?’. 14 ఏళ్ల సునీతి తడబడకుండా చెప్పింది– ‘మా దేశం కోసం చేశాం’. ఈ ఒక్క వాక్యంతో బ్రిటిష్ చట్టం కూడా తలవంచింది. చిన్న పిల్లలు కాబట్టి ఉరిశిక్ష వేయలేక పోయారు. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బ్రిటిష్ పత్రికలు ‘Two School Girls Kill DM‘ అని మొదటి పేజీలో రాశాయి. లండన్ వరకు వార్త పాకింది. సునీతిని అలీపూర్ సెంట్రల్ జైలుకు పంపారు.
బ్రిటిష్ జైల్లో నరకం..
హత్య జరిగిన వెంటనే బ్రిటిష్ సైనికులు సునీతిని, శాంతిని బంధించారు. 14 ఏళ్ల పసిపిల్ల అని కూడా చూడకుండా సునీతిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. విప్లవ సంస్థ రహస్యాలు చెప్పాలంటూ బూట్లతో తన్నారు. కానీ ఆ పసిపెదవుల నుంచి కేవలం ‘వందేమాతరం’ అనే నినాదం తప్ప ఒక్క రహస్యం కూడా బయటకు రాలేదు. ఆమె వయసు చిన్నది కావడం వల్ల ఉరిశిక్ష తప్పి యావజ్జీవం పడింది.
జైల్లో ఆమెకు కనీస సదుపాయాలు లేకుండా నరకం చూపించారు. అయినా ఆమె కళ్లలోని ధైర్యం, ముఖంలోని చిరునవ్వు చెదరలేదు. జ్లైలోనే చదువుకుంది. రాజకీయ ఖైదీలతో మాట్లాడి దేశ చరిత్ర, త్యాగాల గురించి ఇంకా తెలుసుకుంది. 1939లో ఆమ్నెస్టీ, గాంధీ జోక్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. అలా ఎనిమిదేళ్ల తర్వాత సునీతి బయటికి వచ్చింది.
విడుదలైన తర్వాత
విడుదల తర్వాత సునీతి మరో విప్లవ యోధుడు ప్రద్యోత్ కుమార్ గుహను పెళ్లి చేసుకుంది. అతను కూడా జైలుశిక్ష అనుభవించినవాడే. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ సునీతి ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రాలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ‘మేము చేసింది మా కర్తవ్యం’ అని మాత్రమే చెప్పేది. ప్రశాంతంగా కుటుంబంతో జీవితం గడిపి 1988 జనవరి 12న కలకత్తాలో కన్నుమూసింది.
ఆమెతో పాటు కాల్పులు జరిపిన శాంతి ఘోష్ తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎం.ఎల్.ఏగా కూడా పని చేసింది. ఇద్దరూ కలిసి ‘కమిల్లా కన్యలు’ (ది గర్ల్స్ ఆఫ్ కమిల్లా) గా చరిత్రలో నిలిచారు. మనం ఇవాళ అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల వెనుక 14 ఏళ్ల వయసులోనే నవ్వుతూ జైలు పాలైన ఇలాంటి పసి హృదయాల రక్తం ఉందనే సత్యాన్ని మనం మరువలేము. వీర విప్లవ కిశోరం సునీతి చౌదరికి జోహార్లు!
– కె.


