యువతకు స్ఫూర్తిప్రదాత | Dr B.C Roy Guest Column Special Story | Sakshi
Sakshi News home page

యువతకు స్ఫూర్తిప్రదాత

Jun 30 2026 9:22 AM | Updated on Jun 30 2026 9:22 AM

Dr B.C Roy Guest Column Special Story

ఇన్‌ బాక్స్‌

డాక్టర్‌ బి.సి. రాయ్‌

డాక్టర్‌ బి.సి.రాయ్‌గా సుపరిచితులైన బిధాన్‌ చంద్రరాయ్‌ 1882 జూలై 1న నేటి బిహార్‌లోని బాంకీపూర్‌లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించారు. 1925లో రాజకీయాలలో ప్రవేశించారు. బెంగాల్‌లోని బారక్‌పూర్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ‘గ్రాండ్‌ ఓల్డ్‌ మాన్‌ ఆఫ్‌ బెంగాల్‌’గా పేరొందిన సురేంద్రనాథ్‌ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐ.ఎం.ఎ.) ఏర్పాటులోనూ, 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు, అభివృద్ధికి పాటుపడే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎం.సి.ఐ.) ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.

మహత్మాగాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పుణేలో గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్‌ మందులు ఇచ్చారు. ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక... ‘నేను, నువ్వు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి? ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా?’ అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్‌ రాయ్‌ ‘లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నేను వచ్చింది... మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి’కి అన్నారు. గాంధీజీ మాట్లాడకుండా మందులు తీసుకున్నారు.

స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుల ఒత్తిడి మేర  1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాయ్‌. ఆ రోజుల్లో దేశవిభజన కారణంగా బెంగాల్‌ అతలాకుతలమవుతోంది. రాయ్‌ ప్రణాళికబద్ధంగా పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు. తన 80వ ఏట 1962 జూలై 1న తన పుట్టినరోజే తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడటం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం బి.సి. రాయ్‌ సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. రాయ్‌  అవివా హితులు. తన ఇంటిని  తల్లి అఘొర్‌ కామినీదేవి పేరుతో హాస్పిటల్‌కు విరాళంగా ఇచ్చారు. తన ఆస్తులతో ప్రజాప్రయోజనార్థం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. – డా. టి. సేవకుమార్‌, ఐ.ఎం.ఎ. నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యులు (రేపు డా. బి.సి. రాయ్‌ జయంతి, వర్ధంతి – జాతీయ వైద్యుల దినోత్సవం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement