చ.అడుగుకు రూ.1,348.06 చొప్పున దోపిడీ
ట్విన్ టవర్ల నిర్మాణ పనుల్లోనూ అవినీతి
రూ.958.40 కోట్ల కాంట్రాక్టు విలువతో ఏజీఐసీఎల్ టెండర్
రూ.1,002.49 కోట్లతో 4.60 శాతం అదనంగా కోట్
ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ చేతికి పనులు
ఖజానాపై రూ.44.09 కోట్ల అదనపు భారం
పన్నుల రూపంలో మరో రూ.178.1 కోట్లు రీయింబర్స్
చివరకు రూ.1,180.59 కోట్లకు చేరిన కాంట్రాక్టు విలువ
సాక్షి, అమరావతి: రాజధాని పనుల టెండర్లలో అక్రమాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణ పనుల్లో కుమ్మక్కుతో స్కామ్‌కు పునాదులు పడ్డాయి. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనపు ప్రయోజనం చేకూర్చుతూ.. ప్రజాధనాన్ని దోచిపెడుతూ ముఖ్యనేత సిండికేట్ కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీకే ట్విన్ టవర్ల పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. ట్విన్ టవర్ల నిర్మాణ పనులకు రూ.958.40 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రెండేళ్లలో పూర్తి చేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే నిబంధనతో ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు నిర్వహించింది.
కాంట్రాక్టు విలువ కంటే 4.60 శాతం అధిక ధరకు అంటే రూ.1,002.49 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ ఎల్–1గా నిలిచింది. అదే సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏజీఐసీఎల్ చేసిన ప్రతిపాదనపై ఈనెల 4న సీఆర్‌డీఏ 64వ సమావేశం ఆమోదముద్ర వేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల ఖజానాపై రూ.44.09 కోట్లు అదనంగా భారం పడుతుంది. ఇక మరో రూ.178.1 కోట్లను జీఎస్టీ, సీనరేజీ, మెరిట్, తదితర పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం టెండర్‌లో పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,180.59 కోట్లకు చేరుకుంది.
4.83 ఎకరాల్లో ట్విన్ టవర్స్
రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే పిచ్చుకలపాలెం వద్ద క్వాంటమ్ వ్యాలీలో 4.83 ఎకరాల్లో ట్విన్ (జంట) టవర్ల నిర్మాణ పనులను ఏజీఐసీఎల్ చేపట్టింది. ఒక్కో టవర్‌ను బీ+జీ+47 అంతస్తులతో నిర్మించాలని నిర్దేశించింది. బీ+జీ నుంచి నాలుగో అంతస్తు వరకూ ఒక్కో అంతస్తును 5 మీటర్లు.. అక్కడి నుంచి 47వ అంతస్తు వరకూ ఒక్కో అంతస్తు 4.2 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు. పార్కింగ్ ఏరియాతో పాటు ఒక్కో టవర్ నిర్మిత ప్రాంతం 1,53,708 చదరపు మీటర్లు.
రెండు టవర్ల నిర్మిత ప్రాంతం 3,48,406 చదరపు మీటర్లు (37,50,210 చదరపు అడుగులు). అంటే ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి నిర్ణయించిన కాంట్రాక్ట్ విలువ రూ.3,148.06. అదీ కేవలం పునాదులు, పిల్లర్లు, బీమ్‌లు, లిప్ట్‌లు, షాప్‌్టలతో కూడిన భవనం మాత్రమే. ఈ స్థాయి నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనంగా చెల్లించేలా కాంట్రాక్టు పనులు అప్పగించినట్లు వెల్లడవుతోంది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


