రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత | High Court responds to Bharti Cements case | Sakshi
Sakshi News home page

రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత

Aug 8 2026 4:40 AM | Updated on Aug 8 2026 4:40 AM

High Court responds to Bharti Cements case

భారతీ సిమెంట్స్‌ వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు 

పూర్తి వివరాలు తమ ముందుంచాలని పోలీసులకు ఆదేశం 

తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్‌ మైనింగ్‌ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్‌తో పాటు మైనింగ్‌ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్‌ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది.  

కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! 
భారతీ సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్‌ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్‌ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్‌లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. 

అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్‌స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్‌ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్‌రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్‌ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. 

కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... 
ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్‌రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. 

ఈ రోజు కూడా ప్లాంట్‌కు వెళ్లకుండా దారిలో టెంట్‌ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్‌లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement