మన(సు)లో మాట
నా భార్యకు 35 ఏళ్లు. ఆమెకు గత రెండేళ్ల నుండి పూజలు, భక్తి విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లయిన కొత్తలో ఏదో కొంతసేపు దేవుడి గదిలో గడిపేది. ఈమధ్య రోజంతా పూజల్లోనే ఉంటుంది. రోజుకు మూడుసార్లు తలస్నానం చేయటం, బాత్రూంలో గంటకు పైగా గడపటం, గదులన్నీ మాటిమాటికీ శుభ్రం చేయటం చేస్తుంది. దీనివల్ల ఇంట్లో పనులన్నీ చాలా ఆలస్యం అవుతున్నాయి. పిల్లలకు, నాకు కూడా ఆఫీసు సమయానికి క్యారేజీ కట్టలేకపోతోంది.
అదేమని అడిగితే అలా చేయకపోతే కుటుంబానికి అరిష్టం కలుగుతుందని, దేవుడికి కోపం వస్తుందని చెబుతుంది. వీటిని కంట్రోల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. ఆమె చేయడమే కాదు, నన్ను, పిల్లలను కూడా తనలాగే చేయమని ఒత్తిడి చేస్తోంది. మాకేం చెయ్యాలో తెలియటం లేదు. ఇలా అతిగా పూజలు చేయటం కూడా ఏదైనా జబ్బంటారా?
– రామసుబ్రహ్మణ్యం, మహబూబ్ నగర్
మీ బాధ నాకు అర్థం అయింది. పూజలు చేయడం, భక్తి భావం ఉండటం తప్పుకాదు. చాలామంది రోజూ వారివారి నమ్మకాల ప్రకారం దేవుడికి దండం పెట్టుకోవడం, కొంతసేపు పూజ చేయడం మామూలే! కానీ మీ భార్య లాగా, రోజులో ఎక్కువ సమయం పూజలు చేయడం, దేవుడి గదిలోనే రోజంతా గడపటం, ఇంటిని, వంటను సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకు, మీకు సమయానికి వండి పెట్టి స్కూలుకు, ఆఫీసుకు సమయానికి పంపక పోవటం... ఇవన్నీ ఆమెలోని ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి.
అయితే వీటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినా సాధ్యం కావడం లేదని, ఒకవేళ అలా చేయలేకపోతే, కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందన్న భయంతో ఇలా చేస్తున్నట్లు ఆమె చెబుతోందంటున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని పదేపదే చేస్తూ, మిగతా పనులను నిర్లక్ష్యం చేయడం, వద్దనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోవడం లాంటి లక్షణాలన్నీ‘‘అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)’’ అనే మానసిక రుగ్మతకు లోనైన వారిలో ఉంటాయి. ఇది కూడా ఒక మానసిక రుగ్మతే!
మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యత తేడా వచ్చినప్పుడు, ఈ జబ్బు లక్షణాలు బయటపడతాయి. కొందరిలో వారసత్వంగా కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి వారికి మానసిక వైద్యశాస్త్రంలో మంచి చికిత్స ఉంది. కొన్ని మందుల ద్వారాను, ‘‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారానూ వీరిని ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడేయవచ్చు. ఏదైనా అతి మంచిది కాదు, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని మన పెద్దలు అన్నది అక్షరాలా నిజం. మీరు వెంటనే మీ భార్యని దగ్గర్లోని మంచి సైకియాట్రిస్టుకు చూపించి తగిన చికిత్స చేయించండి. ఆమెలో తప్పకుండా మార్పు వచ్చి మళ్లీ పూర్వస్థితికి వస్తుంది. మీరంతా మనశ్శాంతిగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


