సన్నిధి
ఆధ్యాత్మికథ
అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడి గుడి కట్టారు. అదే ఊరికి చెందిన ఆవు పాలను అమ్మే ఓ మహిళ శ్రీకృష్ణుడి భక్తురాలిగా మారింది. తన మంచి చెడ్డలు, కష్ట సుఖాలు కృష్ణుడికి చెప్పుకునేది. తన భర్త కాలమయ్యాక ఆమెకు భక్తి మరింత ఎక్కువయ్యింది.
ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. అతడు అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడటం చేస్తుండేవాడు. అక్కడే అమెరికాలో ఉన్న కన్నడ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా కి రావడం తగ్గించాడు. కాగా ఆ ఊరి వాళ్ళు నెలనెలా కంతులవారీగా డబ్బును ΄÷డుపు చేసేవారు. అలా సమకూరిన డబ్బుతో రెండేళ్ళ కొకసారి తీర్థయాత్రలు చేసేవారు.
ఆ తీర్థయాత్రల్లో ఓ సారి ఆమెకు ఒక కన్నడ వృద్ధురాలు పరిచయమయ్యింది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ఆ వృద్ధురాలు ఉడిపి కృష్ణుడి గురించి, స్వామి మహత్యాల గురించి విశేషంగా వర్ణించింది. అక్కడ బాలకృష్ణుడి రూపంలో స్వామి దర్శనమిస్తాడని, ఆయనను నేరుగా కాకుండా నవరంధ్ర కిటికీ ద్వారా దర్శించాలని చెప్పింది.
అప్పటినుంచి ఆ పాలమ్మే మహిళకు ఉడిపి కృష్ణుడిని చూడాలని కోరిక మొదలయ్యింది. ఊరి వారు చేసే తీర్థయాద్రల్లో ఎన్నో గుడులూ గోపురాలు చూసింది కానీ ఉడిపి గుడికెళ్ళడం కుదరలేదు. ‘కృష్ణా... కరుణించవా’ అని స్వామిని వేడుకునేది. ‘ఉడిపి కృష్ణుని చూడని కళ్ళు కళ్ళేనా’ అని మదనపడేది. వయసు అరవై దాటింది. స్వామిని చూడకుండానే కాలం గడిచిపోతుందేమోనని భయం పట్టుకుంది. అదే విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడేది.
3హఠాత్తుగా ఒకరోజు రాత్రి కొడుకు ఫోన్ చేసి, తనకు కూతురు పుట్టిందని, ఆరవ నెలలో అన్న్రపాశన అనీ, తన భార్య కుటుంబీకులకు ఉడిపిలో అన్న్రపాశన చేసే సంప్రదాయం ఉంది కాబట్టి తాము ఇండియా వస్తున్నామని, తమతోపాటు నువ్వు కూడా ఉడిపి వస్తే బాగుంటుందని అమ్మను కోరాడు. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా చెప్పుకుని పొంగిపోయింది.
ఇండియాకి వచ్చిన కొడుకు, కోడలుతో మొదటిసారిగా విమానం ఎక్కింది. అది ఉడిపికి దగ్గరగా ఉండే షిమాగో వరకు వెళ్ళే విమానం. ఆమె తనతోపాటు చిన్న సంచి కూడా తీసుకు వచ్చింది. అందులో హుండీలో వేయడానికి డబ్బు దాచి ఉంది. తను పెంచే ఆవులకు దూడలు పుట్టిన ప్రతిసారీ అమ్మే జున్ను ద్వారా వచ్చిన డబ్బులవి.
మనవరాలిని ఆడించుకుంటూ ‘అచ్యుతం కేశవం’ అనే పాట పాడుకుంటూ ఆమె ఉడిపి గుడిలోకి ఆధ్యాత్మికానందంతో అడుగు పెట్టింది.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు


