సన్నిధి
భారత విజ్ఞానం
పాండవుల పేర్లు చెప్పగానే అందరూ వారు అయిదుగురూ కుంతీపుత్రులే అనుకుంటారు. అయితే పాండురాజు మొదటి భార్య అయిన కుంతికి దూర్వాస మహర్షి చేసిన మంత్రోపదేశ ప్రభావంతో యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మరాజు, వాయుదేవుడి వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు జన్మించగా... రెండోభార్య అయిన మాద్రికి అశ్వినీదేవతల అనుగ్రహంతో నకుల సహదేవులు జన్మించారు.
నకులుడు అంటే చాలా అందగాడు అని అర్థం. అందుకే నకులుడిని అపర మన్మధుడు అని కూడా అంటారు. నకులుడు కత్తియుద్ధంలో గొప్పవీరుడు. గుర్రాలపోషణలో ఎంతో నైపుణ్యం కలిగినవాడు. పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాటరాజు కొలువులో ‘దామగ్రంథి’ అనే పేరుతో గుర్రాల శిక్షకుడిగా పనిచేశాడు.
కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైన్యంలోని ఏడు అక్షౌహిణుల సైన్యంలో ఒకదానికి నాయకత్వం వహించి యుద్ధంలో పాల్గొన్నాడు. మొదటిరోజు యుద్ధంలో దుశ్శాసనుడితో తలపడి ఓడించినప్పటికీ అన్న భీమసేనుని ప్రతిజ్ఞ వల్ల చంపకుండా వదిలేసాడు. 11వ రోజు యుద్ధంలో తన మేనమామ శల్యుడి రథాన్ని నాశనం చేసి 14వ రోజున యుద్ధంలో ఓడించాడు.
15వ రోజు దుర్యోధనుడితోనూ, 16వ రోజున కర్ణునితోనూ యుద్ధం చేశాడు. 17వ రోజున శకుని కుమారుడు వృకాసురుని, 18వ రోజున కర్ణుని కుమారులైన సుసేనుడు, చిత్రసేనుడు, సత్యసేనులను సంహరించాడు. యుద్ధానంతరం ధర్మరాజు ఉత్తర మధ్రదేశానికి నకులుడిని రాజుగా నియమించాడు. కృష్ణుని అవతారం పరిసమాప్తి కావడంతో, సోదరులతోపాటు రాజ్యాన్ని, సంపదలను పరిత్యజించి హిమాలయాలకు వెళ్లి అక్కడనుండి స్వర్గంవైపు న కులుడు కూడా పయనమయ్యాడు.
– సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు
పర్వం
చుక్కల అమావాస్య!
ఆషాఢ బహుళ అమావాస్యకే ‘చుక్కల అమావాస్య’ అని,‘దీప అమావాస్య’ అనీ పేర్లున్నాయి. ఈ రోజుకున్న విశిష్టతలు, ఆచారాలు... పితృతర్పణాలు: ఈ రోజున పితృలోకంలోని పూర్వీకులు భూలోకానికి వచ్చి, తమకు తర్పణలు ఇచ్చే సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. అందువల్ల ఈ రోజు∙పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయని శాస్త్రోక్తి.
గృహిణులు, నూత్న వధువులు పిండిదీపాలు వెలిగించి, గౌరమ్మ ను పూజించి ముత్తైదువులకు వాయనాలు ఇస్తారు. దీనివల్ల సుమంగళీత్వం, కుటుంబంలో సుఖశాంతులు ్రపాప్తిస్తాయని విశ్వాసం. ఈ రోజు సాయంత్రం ఇళ్లలో, దేవాలయాలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం వల్ల వ్యాధులు, ప్రతికూల శక్తులు, తొలగిపోతాయని ప్రతీతి. ఆషాఢ అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేయడం విశేష ఫలప్రదం. (12, బుధవారం చుక్కల అమావాస్య)


