‘హద్దుల్లో ఉంటే మంచిది’.. రాజగోపాల్‌కు పీసీసీ చీఫ్‌ కౌంటర్‌ | Cold War in Telangana Congress: Rajagopal Reddy's Comments & PCC Chief Mahesh Kumar's Warning | Sakshi
Sakshi News home page

‘హద్దుల్లో ఉంటే మంచిది’.. రాజగోపాల్‌కు పీసీసీ చీఫ్‌ కౌంటర్‌

Aug 14 2026 1:40 PM | Updated on Aug 14 2026 1:57 PM

Cold War In Telangana Congress Rajagopal Reddy And Mahesh Kumar

యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత అసంతృప్తి స్వరం వినిపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. పార్టీకి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేస్తూ.. సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్‌లో ఒకే నిబంధన వర్తిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి హద్దుల్లో ఉండాలి అని స్పష్టం చేశారు.

చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వాన్ని తాను విమర్శించడం లేదని చెప్పారు. అయితే నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నానని తెలిపారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్‌ కార్యకర్తలను అణచివేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావించారు. “సీమాంధ్ర పాలకుల మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం నడవకూడదు.. తెలంగాణ ఆత్మగౌరవంతోనే ప్రజాపాలన సాగాలి” అని అన్నారు.

ప్రభుత్వ పాలన పేదల కోసం ఉండాలని.. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మరోసారి తేల్చిచెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మొత్తంగా.. పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? లేక పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారా? అన్న చర్చ మొదలైంది.

మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేస్తూ.. సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్‌లో ఒకే నిబంధన వర్తిస్తుందని అన్నారు. పార్టీ గీత దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో పార్టీ నాయకత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు.

రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి “రాజగోపాల్‌రెడ్డి హద్దుల్లో ఉండాలి” అని స్పష్టం చేశారు. ఆయన బాధను తాము అర్థం చేసుకోగలమని.. అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇక రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి హామీ ఉందన్న ప్రచారంపైనా పీసీసీ చీఫ్‌ స్పందించారు. ఆయనకు మంత్రి పదవి హామీకి సంబంధించిన సమాచారం తనకు ఉందని, అయితే తుది నిర్ణయం కాంగ్రెస్‌ అధిష్టానం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “క్రమశిక్షణ ఒక లెవల్‌ వరకే ఉంటుంది” అంటూ పరోక్షంగా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, ప్రభుత్వం.. పార్టీ వేరు కాదు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. సమిష్టి నిర్ణయంతోనే అన్ని జరుగుతాయి. కో-ఆర్డినేషన్ కమిటీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టేందుకు కాదు. ప్రభుత్వం ఏం చేసినా పార్టీతో చర్చించడం అవసరం అని వ్యాఖ్యలు చేశారు. 

అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదన్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమకారులేనని అన్నారు. ప్రతి ఒక్కరి కోరికను ఒకేసారి తీర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల రాజగోపాల్‌రెడ్డి “కాంగ్రెస్‌లోనే ఉన్నా.. రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేస్తా” అంటూ పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం, నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. మహేశ్‌గౌడ్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు మంత్రి పదవిపై హామీ ఉందన్న సంకేతం.. మరోవైపు ‘హద్దుల్లో ఉండాలి’ అంటూ హెచ్చరిక.. దీంతో రాజగోపాల్‌రెడ్డి విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement