పార్లమెంట్ సమావేశాలకు ముందే ప్రకటిస్తారని అంచనాలు
కొత్త వారికి అవకాశం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందంటూ మరోసారి వార్తలు షికారు చేస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందుగానే భారీగా మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మార్పుల ప్రక్రియ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించనున్న కొత్త కార్యవర్గం ప్రకటనతో పాటే ఉండొచ్చని కూడా ఊహాగానాలు వినవస్తున్నాయి. త్వరలో నబీన్ ప్రకటించే జాబితాలో సంస్థాగతమైన కీలక బాధ్యతల్లో యువ నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే, నితిన్ గత వారం కొందరు కేంద్ర సహాయ మంత్రులతో చర్చలు జరిపినట్లు సమాచారం. వీరిని పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకుని, చురుగ్గా వ్యవహరించే కొందరు పదాధికారులను ప్రధాని మోదీ కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో, కొందరు మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు జూలైలో, అదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ తేదీని ఖరారు చేయనున్నారు. కీలక మంత్రిత్వ శాఖల్లో కొత్త రక్తాన్ని నింపాలనే ఆలోచనతో పాటు ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు, విధేయత వంటి వాటికి కూడా సమతూకం పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాలకు వరుసగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. బీజేపీ ’ఒక వ్యక్తి –ఒకే పదవి’ విధానం కారణంగా, వీరు కేబినెట్ నుంచి తప్పుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది.
తిరుగుబాటు వర్గాలకు చోటు..
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), శివసేన (యూబీటీ) తిరుగుబాటు వర్గాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు దక్కవచ్చని చెబుతున్నారు. ఆప్‌ని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల్లోకి ఒకరిద్దరికి కూడా అవకాశం లభించవచ్చు.
ఆ ముగ్గురు గవర్నర్ల స్థానంలో..
ప్రస్తుత కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మల రాజ్యసభ పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది. వీరిని తిరిగి నామినేట్ చేయడంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే, కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్), మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్‌ల పదవీకాలం మరికొద్ది నెలల్లో ముగియనుంది. వీరి స్థానాల్లో మంత్రివర్గంలోని కొందరిని పంపే అవకాశమూ ఉంది. ఏదేమైనా, ప్రధాని మోదీ తన కీలక నిర్ణయాలను చివరి నిమిషం వరకు అత్యంత గోప్యంగా ఉంచడం ఆనవాయితీగా వస్తోంది.


