స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం
రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొని 46మంది దుర్మరణం
ఒకే ట్రాక్‌పై వచ్చిన రెండు హైస్పీడ్ రైళ్లు
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు హై స్పీడ్ రైళ్లు ఢీకొన్నభయంకర ప్రమాదంలో కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు భయాందోళనలు కలిగించేలా ఉన్నాయి.
స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్ , అండలూసియా మార్గంలో లోస్ యెబెనెస్, ఉర్డా (తోలెడో) ప్రాంతాల మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు వేగవంతమైన (హై-స్పీడ్) రైళ్లు ఢీకొన్నాయి. మ్యాడ్రిడ్ నుండి సెవిల్లె వెళ్తున్న 'Renfe Ave' రైలు, ఎదురుగా వస్తున్న 'Iryo' కంపెనీకి చెందిన మరో రైలును ఢీకొట్టింది. ఈ దాటికి బోగీలు పట్టాలు తప్పి ఎత్తైన కట్ట కింద పడిపోయాయి. ఈ ఘటనలో 46 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
టోలెడోలో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదంఐ స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు.రవాణా శాఖ మంత్రితో, కాస్టిల్లా-లా మాంచా అధ్యక్షుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ,బాధితులకు సహాయం చేయడానికి ,వారి భద్రతను నిర్ధారించడానికి అత్యవసర సేవల సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడించారు. అనేక అగ్నిమాపక బృందాలు, మూడు హెలికాప్టర్లు,రెండు మొబైల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతో సహా అన్ని సహాయ చర్చల్ని అందిస్తున్నామని స్పానిష్ అత్యవసర సేవల ప్రతినిధి తెలిపారు. మరోవైపు సాంచెజ్,ఇతర స్పెయిన్ రాజకీయ నాయకులు వచ్చే నెల పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంతో సహా, ఈరోజు అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.


