ఆకస్మికంగా కన్నుమూసిన కార్మెన్
అద్దె ఇంటి నుంచి బలవంతంగా తొలగింపు
స్పెయిన్‌లో గృహ సమస్యపై చెలరేగిన ఆందోళనలు
మాడ్రిడ్: పెరిగిపోతున్న ఇంటి అద్దెల విషయంపై యూరోపియన్ దేశం స్పెయిన్‌లో నిరసన జ్వాలలు రగిలించిన 87 ఏళ్ల మహిళ మరియా డెల్ కార్మెన్ అబాస్కల్ బుధవారం ఆకస్మికంగా మరణించారు. రెండు వారాల క్రితం మాడ్రిడ్‌లో 70 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి యజమాని బలవంతంగా కార్మెన్‌ను బలవంతంగా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే.
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గృహ సంక్షోభం, ఇంటి అద్దెల సమస్య ఈ ఒక్క ఘటనతో వీధుల్లోకి వచ్చేసింది. ప్రజల్లో ఏళ్లుగా గూడుకట్టుకున్న ఆగ్రహం కాస్తా కట్టలు తెంచుకుని దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మెన్ మరణించడంతో స్పెయిన్‌లో ఉద్యమం మరోసారి రాజుకుంది. ఇంకో నెలలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనుండటంతో రాజకీయం కూడా ఈ అంశం చుట్టూనే తిరుగుతుందని అంచనా.
కార్మెన్ మృతికి సంతాపంగా మద్దతుదారులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. మాడ్రిడ్‌లోని సెంట్రల్ ప్యూర్టా డెల్ సోల్ వద్ద కార్మెన్ స్మృతి స్థలి ఏర్పాటుకాగా.. పలువురు పుష్పాలతో, లేఖలతో తమ నివాళులు అర్పిస్తున్నారు. ఇంకో ప్లకార్డుపై ‘‘ఇవి మరణాలు కావు.. హత్యలు’’ అని రాసుంది. ఇదే ప్రాంతంలో సెప్టెంబరు 23న కార్మెన్‌న బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ సుమారు వెయ్యిమంది నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం.
మాడ్రిడ్‌లోని రిటైరో పార్క్ ఆరో అంతస్తులోని కార్మెన్ అద్దె ఇంటి తలుపులపై కొందరు మద్దతుదారులు ‘రెస్ట్ ఇన్ పీస్ మారికార్మెన్’ అని రాసిన సందేశాన్ని నల్ల రంగుతో గీసిన గుండె చిత్రాన్ని దీనికి జోడించారు. ‘‘మీ మరణం వృథాకాదు.. పోరు కొనసాగుతుంది’’ అన్న మరో సందేశం కూడా అక్కడ కనిపించింది.


