రైలు ప్రమాదంపై భగ్గుమన్న ప్రజలు.. రవాణా మంత్రికి వ్యతిరేకంగా నిరసనలు | Public outrage over train accident At Spain protests against Transport Minister | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంపై భగ్గుమన్న ప్రజలు.. రవాణా మంత్రికి వ్యతిరేకంగా నిరసనలు

Oct 29 2026 2:48 PM | Updated on Oct 29 2026 2:57 PM

Public outrage over train accident At Spain protests against Transport Minister

మాడ్రిడ్: స్పెయిన్‌లో తాజాగా జరిగిన ఘోర రైలు ప్రమాదం అక్కడి ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 68 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దాంతో రైల్వే భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యమే జరుగుతున్న ప్రమాదాలకు కారణమంటూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రధాని పెడ్రో శాంచెజ్, రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

స్పానిష్ మీడియా కథనాల ప్రకారం.. రాజధాని మాడ్రిడ్‌లోని రవాణా మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట సుమారు 1,500 మంది ఆందోళనకు దిగారు. కొందరు నిరసనకారులు పోలీసులపై సీసాలకు మంటలు అంటించి విసరడంతో పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ ఆందోళనల్లో ఎవరైనా గాయపడ్డారా, అరెస్టులు జరిగాయా అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. నిరసనకారులు రవాణా మంత్రిని ‘మృత్యు మంత్రి’ అంటూ నినాదాలు చేశారు.

రైల్వే భద్రతపై ఆందోళన
జరిగిన ఘటన ఈ ఏడాది స్పెయిన్‌లో జరిగిన రెండో భారీ రైలు ప్రమాదం కావడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మరో ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు దేశంలోని రైల్వే వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయితే తాజా ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని శాంచెజ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. మృతులకు సంతాప సూచకంగా ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించింది. ఈ విషయంపై రైల్వే భద్రతను కాపాడాలంటూ స్పెయిన్ రైల్వే డ్రైవర్ల సంఘం కూడా సమ్మెకు పిలుపునిచ్చింది.

ఇప్పటికే గృహ సమస్యలపై నిరసనలు
స్పెయిన్‌లో ఇళ్ల కొరత, పెరుగుతున్న అద్దెలపై ప్రజలు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల మాడ్రిడ్‌లో 87 ఏళ్ల వృద్ధురాలిని ఆమె నివాసం నుంచి పోలీసులు ఖాళీ చేయించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన గృహ సమస్యలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మరింత పెంచింది. తాజాగా జరిగిన రైలు ప్రమాదం వారి ఆగ్రహాన్ని మరింత తీవ్రం చేయడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

ఇదీ చదవండి: ట్రంప్‌కు టాయిలెట్‌ పంచ్‌.. నార్వే దిమ్మతిరిగే కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement