పశ్చిమాసియా ఉద్రిక్తత.. 22 మంది భారతీయులు మృతి! | 22 indians killed in middle east conflict including 14 seafares centre | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా ఉద్రిక్తత.. 22 మంది భారతీయులు మృతి!

Oct 29 2026 12:34 AM | Updated on Oct 29 2026 1:03 AM

22 indians killed in middle east conflict including 14 seafares centre

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై భారత విదేశాంగ శాఖ కీలక వివరాలు ప్రకటించింది. ఈ ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. వారిలో 14 మంది భారతీయ నావికులు ఉన్నారని పేర్కొంది. ఈ వివరాలు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు.

ఆయన మాట్లాడుతూ.. “ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దురదృష్టవశాత్తూ, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది నావికులు ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.

గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు, అక్కడ పనిచేస్తున్న నౌకా సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. భారత దౌత్య కార్యాలయాలు అక్కడి భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు. ఇదే సమయంలో, ప్రాంతీయ ఉద్రిక్తతలకు సంబంధించిన ఘటనల్లో సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు జైస్వాల్ పేర్కొన్నారు.

పశ్చిమాసియాలోని భారత దౌత్య కార్యాలయాలు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, ప్రమాదకర సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు, నావికుల భద్రత, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.

కాగా సౌదీ అరేబియాలో విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు, ముఖ్యంగా ఉమ్రా యాత్రకు వెళ్లిన భక్తులకు సహాయం చేసేందుకు జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కొత్త ప్రయాణ సూచనలను జారీ చేసింది. భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రయాణికుల కోసం అదనపు విమాన సర్వీసులు, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలను వెల్లడించింది.

సౌదీ విమానయాన అధికారులతో పాటు వాణిజ్య విమానయాన సంస్థలు, భారతీయ సమాజ ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. జెడ్డా, మదీనా విమానాశ్రయాల నుంచి సౌదీ విమానయాన సంస్థలు భారత్‌కు విమానాలను నడుపుతున్నాయని, ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థల ద్వారా వాటి అనుసంధాన కేంద్రాల మీదుగా ఒక స్టాప్‌తో భారతదేశానికి చేరుకునే అవకాశం  ఉందని కాన్సులేట్ పేర్కొంది.

 


ఇదీ చదవండి: బౌద్దసన్యాసికి భిక్షవేసిన యాచకుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement