ఇండియా కూటమి ర్యాలీకి సీజేపీ మద్దతు.. ఇక రచ్చ రచ్చే | CJP backs INDIA blocs Nov 1 rally seeking Gyanesh Kumars exit | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి ర్యాలీకి సీజేపీ మద్దతు.. ఇక రచ్చ రచ్చే

Oct 28 2026 7:54 PM | Updated on Oct 28 2026 7:59 PM

CJP backs INDIA blocs Nov 1 rally seeking Gyanesh Kumars exit

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిర్వహించనున్న ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతు ప్రకటించింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని ఆ ప్రకటనలో కోరింది.

జ్ఞానేశ్ కుమార్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను పర్యవేక్షించేందుకు అవసరమైన విశ్వసనీయతను కోల్పోయారని సీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను పునరుద్ధరించాలంటే ఆయన రాజీనామా చేయాల్సిందేనని అభిప్రాయపడింది.

“ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి తప్ప, ప్రభుత్వం తన ఓటర్లను ఎంచుకోవడం కాదు.. ఇదే ప్రజాస్వామ్యానికి ప్రాథమిక సూత్రం” అని సీజేపీ పేర్కొంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఈ సూత్రాన్ని దెబ్బతీసిందని ఆరోపించింది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించే పరిస్థితులు ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా చేయాల్సింది పోయి, ఓటర్లను మినహాయించే ప్రమాదం పెరిగిందని తెలిపింది.

ప్రజాస్వామ్య దృక్పథాన్ని ప్రస్తావించిన సీజేపీ
రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్రను సీజేపీ గుర్తుచేసుకుంది. కులం, మతం, లింగం, విద్య, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి వయోజన పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించారని పేర్కొంది. రాజ్యాంగ నిర్మాతలు అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు లక్షలాది మంది భారతీయులు అప్పటివరకు ఎన్నికల్లో పాల్గొనకపోయినా ప్రజలపై విశ్వాసం ఉంచారని తెలిపింది.

“ప్రతి పౌరుడికి దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది” అని పార్టీ పేర్కొంది. పౌరులను ప్రజాస్వామ్యంలోకి మరింతగా తీసుకురావాలి తప్ప, వారిని దూరం చేయకూడదని తెలిపింది. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత అని స్పష్టం చేసింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల కోసం పోరాడే సంస్థలకు మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ, “జై భీమ్.. జై హింద్” అని పేర్కొంది.

అక్టోబర్ 30 కార్యక్రమం వేదిక మార్పు
ఇదిలా ఉండగా, జ్ఞానేశ్‌ కుమార్‌పై నిరసనగా అక్టోబర్ 30న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసానికి మార్చినట్లు ఇండియా కూటమి ప్రకటించింది. అశోక హోటల్, రాంలీలా మైదాన్‌లో కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం, న్యూఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

రాంలీలా మైదాన్‌లో ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు మైదానాన్ని బుక్ చేసుకున్నప్పటికీ, ఏర్పాట్లకు ఆటంకం కలిగించారని అన్నారు.

నవంబర్ 1 ర్యాలీలో ఓటరు జాబితాల సవరణ, ఎన్నికల అక్రమాల ఆరోపణలు, “ఓట్ల చోరీ” అంశాలను ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. ఈ కార్యక్రమంలో 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనాలని ప్రణాళిక రూపొందించినట్లు వేణుగోపాల్ తెలిపారు. సీజేపీ మద్దతుతో ఎన్నికల సంఘం జవాబుదారీతనం, అర్హులైన ఓటర్ల హక్కుల పరిరక్షణపై ప్రతిపక్షాల ప్రచారానికి మరింత బలం చేకూరే అవకాశముంది. ర్యాలీ నిర్వహణ, అనుమతులపై నెలకొన్న వివాదం తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి.

 

ఇదీ చదవండి: డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర క‍్యాబినెట్ కీలక నిర్ణయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement